ప్రభుత్వం నోటికాడ కూడు లాగేసుకుంటోంది

నరసన్నపేట(పోలాకి): ఎన్నికల్లో చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోయామని పల్లిపేట పంచాయతీ ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఎదుట వాపోయారు. పల్లిపేట పంచాయతీలోని పల్లిపేట, బీసీకాలనీ, చితపానపేట గ్రామాల్లో గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో కృష్ణదాస్‌ పాల్గొని ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. రెండున్నరేళ్లుగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని చెబుతున్నా ఎదురుచూపులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇచ్చాపురం రూరల్‌: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన పింఛన్‌లను ఈ ప్రభుత్వం నిలిపివేసి తమ నోటికాడ కూడు లాగేసుకుందని కొళిగాం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో  కొళిగాంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వాల హయాంలో అందిన పింఛన్‌ను జన్మభూమి కమిటీల పుణ్యమాని తొలగించేశారని బాధితులు నర్తు రామారావు ఎదుట వాపోయారు.  ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ గడపగడపకు ప్రజా బ్యాలెన్‌ను పంచి పెట్టారు. 

సూళ్లూరిపేట(దొరవారిసత్రం): ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా అధికార పార్టీ నాయకులు దక్కించుకుని అర్హులకు అన్యాయం చేస్తున్నారని పలువురు స్థానికులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎదుట వాపోయారు. కల్లూరు గ్రామంలో గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం ఎమ్మెల్యే కిలివేటి, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వూరు బాలచందారెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజా బ్యాలెట్‌ను పంపిణీ చేశారు. కల్లూరు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఎమ్మెల్యేకి వివరించారు. 

Back to Top