దోచుకోవడం..దాచుకోవడమే సీఎం ఎజెండా

తిరుచానూరు : దోచుకోవడం, దాచుకోవడమే చంద్రబాబు ఎజెండా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తిరుపతిలోని 3వ డివిజన్‌(పార్వతీపురం, లెనిన్‌నగర్, ప్రగతి నగర్, గరుడాద్రి నగర్‌) వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో  గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా భూమన ఇంటింటా తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రధాన ఎజెండా దోచుకోవడం...దాచుకోవడమేనని ధ్వజమెత్తారు.  పొద్దున్నుంచి...రాత్రి పడుకునే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తనను తాను ఈ దేశంలోనే గొప్ప సీఎంగా డప్పు వాయించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పక్కనపెట్టి దోచుకోవడానికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేశామంటున్న చంద్రబాబుకు ఇక్కడి ప్రజల సమస్యల కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. తిరుపతి అభివృద్ధి చెంది ఉంటే నేటికి 42మురికివాడల్లో లక్షన్నరకుపైగా జనాభా ఎందుకు నివసిస్తున్నారో చెప్పాలన్నారు.  అర్హులైన దాదాపు 7వేల మందికి పెన్షన్‌ ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారన్నారు. గరుడాద్రినగర్‌లో నివాసముంటున్న పి.ఖాదర్‌బీకి భర్త, పిల్లలు లేరని, అన్ని అర్హత ఉన్నా ఇటు వృద్దాప్య, అటు వితంతు పెన్షన్‌ కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు పాలనకు నిదర్శనమన్నారు. దోమలపై దండ యాత్ర పేరుతో అవినీతికి తెరతీశారని, చంద్రబాబు తిరుపతికి వస్తే అతనిపై దోమలే దండ యాత్ర చేస్తాయని ఎద్దేవా చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, తిరుపతి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ సెల్‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రాజేంద్ర, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు హనుమంతునాయక్, మైనారిటి సెల్‌ జిల్లా అధ్యక్షులు షఫి అహ్మద్‌ఖాద్రి, 3వ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి దేవరాజులరెడ్డి,  నాయకులు భరణియాదవ్, మోహన్, నాగరాజు, రవి, ముద్రనారాయణ, రుద్రగోపి, పునీత, లక్ష్మీరెడ్డి, పుష్పలత, శ్యామల, శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top