రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రైతన్న పరిస్థితి దుర్భరంగా మారిందని, వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను ఘోరంగా మోసం చేశారన్నారు. సోమయాజులపల్లె గ్రామంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ లక్ష్మీకాంతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ  చెన్నూరు సంజీవరెడ్డి, ఎంపీపీ వెంకటరమణమ్మ భర్త మోహన్‌ రావు, మండల కో ఆఫ్షన్‌ సభ్యులు షంషుద్దీన్, గ్రామ సర్పంచ్‌ నాగమల్లేశ్వరి హాజరయ్యారు. 

ముందుగా గ్రామంలోని ప్రధాన సమస్యలు, ప్రజల ఇబ్బందుల గురించి సర్పంచ్‌ నాగమల్లేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామంలోని వివిధ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం గౌరు చరిత మాట్లాడుతూ... ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బలపర్చాలని కోరారు. 
Back to Top