బాబుపై మహిళల ఆగ్రహం

రాజంపేట టౌన్ః ఎన్నికలప్పుడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే  డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయ్యేవి...చంద్రబాబు హామీలు నమ్మి మోసపోయాం.  రుణాలు మాఫీ చేయకుండా   మమ్మల్ని నట్టేట ముంచాడంటూ డ్వాక్రా మహిళలు తమ గోడును వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ఎదుట వెల్లబోసుకున్నారు. రాజంపేట పట్టణం 12వ వార్డులోని సరస్వతీపురంవీధిలో శనివారం వైయస్సార్‌ సీపీ మున్సిపాలిటీ కన్వీనర్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆకేపాటి గడప, గడపకు వైయస్సార్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆకేపాటి, పోలాలు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా రుణాలను కట్టలేదని, ఇప్పుడు వడ్డీలకు వడ్డీలు పెరిగి కట్టుకోలేని పరిస్థితి నెలకొందని డ్వాక్రా మహిళలు వాపోయారు. జగన్‌ సీఎం అయివుంటే నయాపైసాతో సహా మా రుణాలన్నీ మాఫీ అయ్యేవని డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తెలిపారు. ఇదిలావుంటే డ్రైనేజీలు లేక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 

సొంత ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి స్థలాలకు, పక్కాగృహాలకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు టీడీపీ వాళ్ళు చెప్పిన వారికే మంజూరు చేస్తున్నారని వాపోయారు. ఇదిలావుండగా తమకు ఇళ్ళు మంజూరైందని చెపుతున్నారు కాని, ఇంత వరకు ఒక్కపైసా ఇవ్వలేదని పలువురు వాపోయారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో  ఇప్పుడు ఒక్కటి కూడా అమలు  చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైఎస్‌ ఛైర్మన్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ్ రెడ్డి, వైయస్సార్‌ వివిధ విభాగాల ప్రతినిధులు రెడ్డిమాసి రమేష్‌నాయుడు, పసుపులేటి సుధాకర్, దండు గోపి, హరి, మహమ్మద్, అంజి తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top