బాబు హయాంలో అభివృద్ధి సున్నా

  • అవినీతి సొమ్ముతో టీడీపీ దెయ్యాలు వస్తాయి
  • దేవుడి మీద ప్రమాణం చేయించి చేతిలో రూ.5వేలు పెడతారు
  • దేవున్ని తలచుకొని లౌక్యంగా ఆలోచించండి
  • ఓటు వేసేటప్పుడు ధర్మానికి మాత్రమే ఓటేయండి
  • రోడ్లు, బిల్డింగ్ లు పడగొట్టడం అభివృద్ధి కాదు
  • నంద్యాలను నాకు వదిలేయండి
  • అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా
  • ఏటీఎం సెంటర్ లో వైయస్ జగన్ ప్రచారం
నంద్యాలః చంద్రబాబు మోసాలు, అన్యాయాలు, అధర్మ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  నంద్యాల పట్టణంలోని ఏటీఎం సెంటర్ లో వైయస్ జగన్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే...మూడున్నరేళ్లలో నంద్యాల ముఖం చూడని ముఖ్యమంత్రి, ఆయన కొడుకు, మంత్రులు, టీడీపీ నాయకులంతా ఉపఎన్నిక రాగానే ఇక్కడి రోడ్లపై తిరుగుతున్నారు. బాబు క్యాబినెట్ అంతా నంద్యాలలోనే తిష్టవేసింది. టీడీపీ నాయకులంతా లాడ్జిల్లో దిగారు. ఈ మూడున్నరేళ్లలో ఉపఎన్నికలు రానంతవరకు ఒక్కరోజైనా బాబు, ఆయన కొడుకు నంద్యాల రోడ్లపై  కనిపించారా..? ఉపఎన్నికలు వచ్చాయి కాబట్టి, వైయస్సార్సీపీ పోటీ చేస్తుంది కాబట్టి నంద్యాలలో తిష్టవేశారు. వైయస్సార్సీపీ పోటీ చేయకపోయింటే, ఎకగ్రీవంగా వదిలేసి ఉంటే ....బాబు నంద్యాలకు ఒక్క రూపాయైనా ఇచ్చి ఉండేవారా..?ఇది బాబు నైజం. ఎన్నికలొచ్చినప్పుడే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తరు. ఎన్నికలు రాకపోతే ప్రజలను వెన్నుపోటు పొడుస్తాడు. ప్రతి సామాజిక వర్గానికి ఎర వేస్తున్నాడు. లొంగని వాళ్లను బుజ్జగిస్తున్నారు. అలా కూడ లొంగని వాళ్లను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. 

ఈ మూడున్నరేళ్లలో ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని బాబు అమలు చేయలేదు కాబట్టే ప్రజల్లోకి వచ్చే ధైర్యం చేయడం లేదు. బాబువన్నీ తప్పుడు మాటలు, మోసాలు. ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం చేశాడు. ఎన్నికల్లో గెలవడం కోసం మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత అందరినీ వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి అన్నది లేదు. నేను ఇన్ని ఇళ్లు కట్టిచ్చానని చెప్పే ధైర్యం లేదు. పేదల జీవితాలతో ఆడుకుంటున్నాడు. రేషన్ షాపుల్లో ఇంతకుముందు చక్కరె, గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్ వచ్చేవి. బాబు ముఖ్యమంత్రి అయ్యాక బియ్యం తప్ప ఏమీ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడ వేలిముద్రలు పడడం లేదని ఎగనామం పెడుతున్నరు. మూడున్నరేళ్లలో  పేదవాడికి ఒక్కటంటే ఒక్క ఇళ్లైనా కట్టించాడా అని నేను అడుగుతున్నా. బాబు హయాంలో అభివృద్ధి సున్నా. బాబు విపరీతమైన అవినీతితో దారుణమైన పాలన చేస్తున్నాడు. నంద్యాల ఎన్నికలకొచ్చేసరికి ఈ దారుణమైన పాలనను కప్పిపుచ్చుకునేందుకు ప్రలోభాలు, మోసాలు, డబ్బులతో నాయకులను, ఎమ్మెల్యేలను కొనడం చేస్తున్నాడు. బాబుకు కళ్లు నెత్తికెక్కాయి.  ప్రజలను కూడ కొనేస్తే సరిపోతుందన్న అహంకారంతో ఉన్నడు . నంద్యాల ఎన్నికల్లో ఇవాళ మనం వేసే ఓటు ఎవరినో ఎమ్మెల్యేగా ఎన్నుకునేందుకు కాదు. చంద్రబాబు చేసిన మోసానికి, అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేయండి. రాబోవు కురుక్షేత్ర సంగ్రామంలో మీరు వేసే ఓటు మార్పుకు నాంది పలకాలి. రేపు ఎవరైనా మైక్ పట్టుకొని పలాన చేస్తానని చెప్పి చేయకపోతే ప్రజలు కాలర్ పట్టుకొని నిలదీస్తారన్న భయం వస్తేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. 

బాబు మాదిరి నా దగ్గర అధికారం, డబ్బులు, పోలీసులు లేరు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే టీవీ, పత్రికలు లేవు. నాకున్న ఆస్తి. దివంగత ప్రియతమ నేత వైయస్ రాజశేఖర రెడ్డి 8ఏళ్ల కిందట చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి. నాకున్న ఆస్తి వాళ్ల నాన్న మాదిరిగానే గొప్ప పరిపాలన అందిస్తాడన్న నమ్మకం. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే నాకు ఆస్తి. అధికారం కోసం ఈ మూడున్నరేళ్లు బాబు ప్రజలను మోసం చేశాడు. ఈ మూడున్నరేళ్లలో కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి, ఇసుక, మట్టి, మద్యాన్ని , చివరకు గుడిభూములను కూడ వదల్లేదు. విశాఖ భూములు మొదలుకొని రాజధాని భూముల వరకు విపరీతంగా దోపిడీ చేశారు.  అలా  విపరీతంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో రాబోయే రోజుల్లో మూటలు, మూటలు తీసుకొస్తడు.  జేబులోంచి దేవుడి పటం తీస్తడు. ప్రమాణం చేయించి రూ. 5వేలు చేతిలో పెడతడు.  ఏదేవుడు పాపానికి ఓటేయమని చెప్పడు. అలా పాపానికి ఓటేయమని దెయ్యాలు మాత్రమే చెబుతాయి. ఆ దెయ్యాలు వచ్చి రూ. 5వేలు చేతిలో పెడతాయి. లౌక్యంగా ఆలోచించండి. ధర్మం వైపు ఉంటానని దేవున్ని తలచుకోండి.  ఓటు వేసేటప్పుడు ధర్మానికి, న్యాయానికే ఓటు వేయండి. ఇవాళ జరుగుతున్న పోరాటం ధర్మయుద్ధం. ఇష్టమొచ్టినట్టు చెప్పి వెన్నుపోటు పొడిస్తే చూస్తూ ఊరుకోమని బాబుకు చెప్పడం. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటంలో న్యాయం వైపు నిలబడండి. శిల్పా మోహన్ రెడ్డిని  ఆశీర్వదించండి. 

చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్ లు టపాటపా పడగొట్టుకుంటూ పోవడమేమో.  ఇదంతా చూస్తుంటే భారతదేశంలో ఉన్నట్టు లేదు. జనాభా పెరుగుతున్నప్పుడు ఎక్కడైనా రోడ్ల విస్తరణ జరుగుతుంది. కానీ, బాబుకు  మూడున్నరేళ్ల తర్వాత రోడ్ల విస్తరణ గుర్తుకొచ్చింది. రోడ్ల పక్కన ఇష్టారీతిన షాపులు పడగొడితే ఎలా బతుకుతారన్న ఆలోచన కూడ బాబుకు రాలేదు. రోడ్ల విస్తరణ చేసేటప్పుడు షాపుల వాళ్లతో మాట్లాడి మార్కెట్ రేటు ప్రకారం డబ్బులిస్తున్నామా లేదా చూడాలి. అవేమీ చూడకుండా టపాటపా బుల్డోజర్లను పెట్టి కొట్టేశాడు. బాధితులు లోబోదిబోమంటే లక్ష 20 వేలు  విలువ చేసే చోట ముష్టివేసినట్టు 18వేలు ఇస్తడట. ఇదే బాబు ఇళ్ల విషయంలో  మోసం చేస్తున్నాడు. పేదవాడికి 300 అడుగులు ప్లాట్ ఇస్తడట. బాబు తనకు నచ్చిన బినామీలను తీసుకొచ్చి అడుగుకు వేలు అవుతున్న కాంట్రాక్ట్ పనిని రూ. 2,078 అమ్ముతున్నాడు. పేదవాడికి ఆరులక్షలకు అమ్ముతడట.  ఇచ్చే ప్లాటులో కేంద్రం, రాష్ట్రం లక్షన్నర సబ్సిడీ ఇస్తదట. మరో మూడు లక్షలు పేదవాడి పేరు మీద అప్పుగా రాస్తడట. నెలనెల రూ. 3వేలు కట్టాలట. లంచాలు తీసుకునేది బాబు. 20ఏళ్లపాటు పేదవాడు డబ్బులు కట్టాలట. అభివృద్ధి అనే పదానికి బాబుకు అర్థం తెలియదు. అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తా. నామీద నమ్మకం ఉంచండి. ప్రతి పేదవాడిలో చిరునవ్వులు చూడడమే అభివృద్ధి. పులివెందుల తర్వాత అదే స్థాయిలో నంద్యాలను అభివృద్ధి చేసి చూపిస్తా. కేసీ కెనాల్ వైయస్ఆర్ హయాంలో రెండు పంటలు పండేటివి. బాబు వచ్చాక మూడున్నరేళ్ల నుంచి వర్షాలు లేవు. కోటిమంది అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని చెప్పి బాబు మోసం చేశాడు. అక్కచెల్లెమ్మలను బాబు ఏడిపిస్తున్న కారణంగానే రాష్ట్రానికే అరిష్టం పట్టుకుంది.
Back to Top