వైవీ సుబ్బారెడ్డి ఆసుప‌త్రికి త‌ర‌లింపు


ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించ‌డంతో ఢిల్లీ పోలీసులు బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సోమ‌వారం దీక్షా స్థ‌లికి చేరుకున్న పోలీసులు నాలుగు రోజులుగా ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న సుబ్బారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆసుప‌త్రికి త‌ర‌లించారు.   ఆరోగ్యం క్షీణించినా, అస్వస్థతకు గురైనా తమ ఆశయాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఎంపీలు తేల్చిచెబుతున్నారు. ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష సోమ‌వారం నాలుగో రోజుకు చేరింది. వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో ఢిల్లీ ఎపీ భవన్‌లోని దీక్షా ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. శ‌నివారం ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎంపీ, మాజీ ఐఏఎస్‌ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు బ్లడ్‌ షుగర్‌ స్థాయి తగ్గి, ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. 65 ఏళ్ల వయసున్న వరప్రసాదరావు మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరో గ్యం క్షీణించడం, అయినా తాను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేయడంతో వేదిక ప్రాంగణంలో ఉన్న పార్టీ నేతలు, శ్రేణుల కళ్లు చెమ్మగిల్లాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు రామ్‌మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రికి తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలని, పోలీసుల జులుం నశించాలని, ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. 
Back to Top