వైయస్ వాగ్దానం గుర్తు లేదా?

మచిలీపట్నం 2 ఏప్రిల్ 2013 : రాబోయే ఐదేళ్లూ కరెంట్ చార్జీలు పెంచబోమని దివంగత మహానేత వైయస్ వాగ్దానం చేస్తే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అలాంటి హామీ ఏదీ లేనట్లుగా మాట్లాడుతున్నారని శ్రీమతి వైయస్ షర్మిల విమర్శించారు. రాజశేఖర్ రెడ్డిగారు ఏ చార్జీలూ పెంచబోమని ముఖ్యమంత్రి హోదాలో వాగ్దానం చేసినప్పుడు బొత్సగారు అదే క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్న బొత్సకు ఆ వాగ్దానం తెలియదంటే ఆయన ఎంత సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థమౌతూనే ఉందని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా మచిలీపట్నంలో మంగళవారం రాత్రి జరిగిన ఒక భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డిగారు ఒక మాట ఇస్తే దాని కోసం ప్రాణమైనా ఇచ్చేవారని ఆమె అన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తాననీ, ౩౩ కిలోల బియ్యం కూడా ఇస్తాననీ వాగ్దానం చేశారన్నారు. కానీ బొత్సగారికీ, కాంగ్రెస్ ఆ మాటలు కూడా జ్ఞాపకం లేవని ఆమె ఆక్షేపించారు. రాజశేఖర్ రెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన మాటల్ని మటుకు బేఖాతరు చేస్తోందన్నారు. "రాజశేఖర్ రెడ్డిగారిచ్చిన వాగ్దానాలు బొత్సగారికి గుర్తు లేవంటే...బొత్సగారూ...2009 మేనిఫెస్టో మీ దగ్గర కాపీ ఉందా? లేక మమ్మ్లల్నే పంపించమంటారా?" అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. 

రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నఐదేళ్లలో ఏ చార్జీ కూడా పెరగలేదని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు తన హయాంలో వంట గ్యాస్ ధరను రెట్టింపు చేస్తే రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన రోజున రూ. 305 గా ఉన్న దాని ధర చివరి వరకూ రూ. 306 కూడా కాలేదని ఆమె అన్నారు. ఆర్టీసీ, కరెంటు చార్జీలు రూపాయి కూడా పెంచలేదన్నారు. ఒక్క రూపాయి కూడా ఏ చార్జీ పెంచకుండానే రాజశేఖర్ రెడ్డిగారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. కానీ ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో అన్ని చార్జీలూ పెరిగిపోయాయని ఆమె విమర్శించారు. గ్యాస్, ఆర్టీసీ, కరెంట్...ఇలా సమస్తమైన చార్జీలన్నీ పెంచి రైతుల, చేనేతల, మహిళల ఉసురు పోసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రజలను ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగానూ ఈ ప్రభుత్వం హింసిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పూటలా ఇల్లు గడవడం లేదని మహిళలు వాపోతుంటే, అప్పుల పాలయ్యామని రైతులు ఆక్రోశిస్తున్నారని శ్రీమతి షర్మిల అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయన్నారు. కరెంట్ ఎక్కడా లేదన్నారు. వ్యవసాయమూ, పరిశ్రమలు కుదేలైపోతున్నా పాలకులు కళ్లప్పగించి చూస్తున్నారని ఆమె తూర్పారబట్టారు. పరిస్థితి ఇంతగా దిగజారినా కూడా ప్రధాన ప్రతిపక్షానికీ పట్టలేదన్నారు. 

"రైతులకు మూడు గంటలు మాత్రమే ఉచిత విద్యుత్తు ఇస్తున్నారు.పరిశ్రమలకైతే నెలకు పదిహేను రోజులు కరెంటు కట్. ఈ ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్తు ఇవాళో రేపో ఎత్తేసినా ఎత్తేస్తారు." అని ఆమె విమర్శించారు.

"కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు. ఉన్న పరిశ్రమలు మూతబడి 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అక్కడికి తామేదో బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నట్లు ఏకంగా 32 వేల కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన కరెంట్ చార్జీల రూపంలో మోపి వాళ్ల రక్తం పిండైనా వసూలు చేయాలనుకుంటోంది ఈ ప్రభుత్వం..." అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజల మీద కక్ష కట్టినట్లుగా ప్రవర్తిస్తున్న ఈ పాలకులను నాయకులు అనాలా? లేక రాబందులు అనాలా? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా ఆరు వేల కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఈ ప్రభుత్వం కరెంటు భారం,  వ్యాట్ రూపంలో అదనంగా పదివేల కోట్ల రూపాయల భారం మోపుతోందంటే దానికి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడే బాధ్యుడని ఆమె ఆరోపించారు. ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాలలో తనపై విచారణ జరగకుండా ఉండేందుకే చంద్రబాబు అవిశ్వాసం విషయంలో ప్రభుత్వానికి ప్రజలను తాకట్టు పెట్టి అమ్ముడుపోయాడని ఆమె దుయ్యబట్టారు. దాని ఫలితంగానే జనం నెత్తిన కరెంట్ చార్జీల భారం పడిందన్నారు.

కరెంటు చార్జీల పాపం బాబుదే!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు పలికి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేదన్నారు. అలా కూలిపోయి ఉంటే ఇలా కరెంట్ చార్జీల భారం ఉండేదే కాదన్నారు. కరెంట్ చార్జీల పెంపులో కిరణ్ కుమార్ రెడ్డికి ఎంత పాపం ఉందో చంద్రబాబుకూ అంతే పాపం ఉందన్నారు. ఇద్దరూ కుమ్మక్కై ప్రజలను వేపుకు తింటున్నారన్నారు. చంద్రబాబు తన ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పాలనలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచితే కిరణ్ కుమార్ రెడ్డిగారు నాలుగు సంవత్సరాలలో నాలుగుసార్లు పెంచారన్నారు. వీళ్లిద్దరూ దొందూ దొందేనన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలిచిన చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోయాడని శ్రీమతి షర్మిల విమర్శించారు.

తుగ్లక్ పరిపాలన అనీ, కాంగ్రెస్ పార్టీకి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదనీ, కత్తులూ గొడ్డళ్లూ తీసుకుని ఈ ప్రభుత్వాన్ని చంపేయాలనీ
కల్లబొల్లి మాటలు కుప్పలు తెప్పలుగా చెప్పిన చంద్రబాబు చేతల్లో మాత్రం ఈ ప్రభుత్వాన్ని స్వయంగా పూనుకుని నిలబెట్టాడని ఆమె నిందించారు. ఇలాంటివాడిని  నాయకుడంటారా? ఊసరవెల్లి అంటారా? అని ఆమె ప్రశ్నించారు.

ఏటా కరెంటు చార్జీలు పెంచుతానని చంద్రబాబు తన హయాంలో ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నవాడని ఆమె గుర్తు చేశారు. ఉచిత విద్యుత్తు ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప అవి దేనికీ పనికి రావని చంద్రబాబు నాడు హేళన చేశారని ఆమె చెప్పారు.

చంద్రబాబు రెండెకరాల నుంచి వేలకోట్ల ఆస్తులు సంపాదించారన్నారు. సింగపూర్, మలేషియాల్లో ఆయన ఆస్తులు  కూడబెట్టారన్నారు. 

"మేము ధైర్యంగా చెబుతున్నాం...వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజశేఖర్ రెడ్డిగారి ప్రతి పథకాన్నీ అమలు చేస్తామని చెబుతున్నాం. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తన పాలన మళ్లీ తెస్తామని చెప్పగలరా?" అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.  కానీ చంద్రబాబుకు ఆ ధైర్యం లేదనీ, అందుకే రాజశేఖర్ రెడ్డిగారి పథకాలనే అమలు చేస్తానంటూ చెప్పుకు తిరుగుతున్నారనీ ఆమె ఎగతాళి చేశారు.




Back to Top