హైదరాబాద్: దివంగత వైఎస్సార్ 12 ఏళ్ల కిందట చేసిన పాదయాత్ర చరిత్రాత్మకమైందని, మలమల మాడే ఎండల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన ఈ సుదీర్ఘమైన యాత్ర చేశారని జగన్ అన్నారు. భయంగొలిపే ఎండల్లో వైఎస్ పాదయాత్ర చేసిన ఫలితంగా ఆయనకు వడదెబ్బ సోకి వారం రోజులపాటు అనారోగ్యానికి గురయ్యారని, ఆ సమయంలో తాను కూడా రాజమండ్రికి వెళ్లి చూశానని జగన్ తన తండ్రి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.
‘‘ఆ రోజుల్లో చంద్రబాబు సర్కారు యూజర్ చార్జీల దగ్గరి నుంచి కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీల వంటివన్నీ పెంచేసి ప్రజలను వరుసగా బాదేస్తూ ఉండేది. ప్రజలపై భారం మోపడానికే ఈ సర్కారు ఉన్నదా! అనేలా బాబు పాలిస్తూ ఉండేవారు. చార్జీల వాతలిలా ఉంటే మరోవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులుండేవి. ఒక హెచ్‌పీ విద్యుత్‌కు అప్పటిదాకా ఉన్న చార్జీని రూ.50 నుంచి 665 రూపాయలకు చంద్రబాబు అప్పట్లో పెంచేశారు’’ అని ఆయన గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే... ‘అపుడు కరెంటు తీగలు బట్టలారేసుకోవడానికే పనికి వస్తాయి...’ అని చంద్రబాబు అవ హేళన చేశారన్నారు.
ప్రజలు పడుతున్న బాధల్లో వారికి తోడుగా నిలబడి.. మీకు అండగా ఉండటానికి మేమొస్తున్నామని వైఎస్ ఒక భరోసాను పాదయాత్రలో ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ వైద్య విభాగం నేత గోసుల శివభరత్‌రెడ్డి, హిందూపురం లోక్‌సభా నియోజకవర్గం వైసీపీ నేత డి.శ్రీధర్ , తెలంగాణకు చెందిన నేత సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.