నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం తథ్యం

ఆదోని టౌన్‌: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజాధనం, అధికారం దుర్వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రసాదరావు ఆరోపించారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే ఎన్నికల పోలింగ్‌ రోజు కేంద్రాల వద్ద తిష్టవేసినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ధీమాను వ్యక్తంచేశారు. గురువారం ద్వారకాఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉప ఎన్నిక సందర్భంగా సీఎం ఆరు రోజుల పాటు నంద్యాలలో పర్యటించారన్నారు. సీఎం తనయుడు మంత్రి నారా లోకేష్‌తోపాటు 12 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు 6మంది ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు కార్యకర్తలు, నాయకులు, అధికారులు సుమారు 4 వేల మంది నంద్యాలలో మకాం వేశారని చెప్పారు. వీరితోపాటు సినీనటుడు బాలక్రిష్ణ, వేణుమాధవవ్‌ నంద్యాలలో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారన్నారు. వైయస్‌ఆర్‌ పార్టీ, అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అంటే సీఎంతోపాటు ఆపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల గుండెల్లో దడ కొట్టుకొచ్చినట్లైందన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ డబ్బును వెదజల్లినా గెలిచేది శిల్పామోహన్‌రెడ్డి అని గంటాపథంగా చెప్పారు. ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ చేస్తున్న ఖర్చుల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. చిత్తశుద్ధి నైతిక విలువలను పాటించాలన్నారు. ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ పక్షాన వున్నారన్న వాస్తవాన్ని గమనించాలన్నారు. ఎన్నో ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

Back to Top