అబద్ధాలు చెప్పేందుకు సిగ్గేయడం లేదా

పార్లమెంట్ లో హోదా కోసం గొంతెత్తుతాం
హామీల అమలు కోసం నిలదీస్తాం
చంద్రబాబుకు దోచుకోవడమే పని


హైదరాబాద్ః వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఎంతసేపు ఎలా దోచుకుందామన్న ధ్యాసే తప్ప మరొకటి లేదన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ గొంతెత్తి నినదిస్తుందని బొత్స తేల్చిచెప్పారు. ధాన్యం సేకరణ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని..అదేవిదంగా  తుఫాన్, కరువు ప్రాంతాలకు అధిక నిధులివ్వాలని కోరతామన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు కోసం నిలదీస్తామన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమతో కలసిరావాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో ఇద్దరు మంత్రులుండి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ఎందుకు పోరాడడం లేదని బొత్స ప్రశ్నించారు.  ప్రత్యేకహోదాను ఎందుకు కోరడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. విభజన చట్టంలోని అంశాలను గట్టి సాధించుకోవాలన్న తపన ప్రభుత్వానికి  ఎంతమాత్రం లేదన్నారు. ఇక రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని దుయ్యబట్టారు. ఇసుక , మద్యం, మట్టి, గనుల దోపిడీకి పాల్పడుతూ టీడీపీ నేతలు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల జీవనాధారమైన పోలవరాన్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చట్టంలో పేర్కొన్నారని.. అది ఒక్క అడుగైనా ముందుకు పడిందా అని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరాన్ని మరుగున పర్చేందుకే....అవినీతి ప్రాజెక్ట్ పట్టిసీమను తెరపైకి తీసుకొచ్చారన్నారు. 
 
బాక్సైట్ తవ్వకాల జీవో నాకు తెలియకుండా ఇచ్చారంటూ ముఖ్యమంత్రి బరితెగించి మాట్లాడుతున్నారని బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  అలా మాట్లాడేందుకు సిగ్గుగా లేదా చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా అని ఎత్తిపొడిచారు.  బాక్సైట్ పై శ్వేతపత్రం రిలీజ్ చేసిన చంద్రబాబు...దాని వెనుక ఎంత ముడుపులు అందాయో ఆ వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ ను వ్యతిరేకించిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక జీవోను ఎందుకు రద్దు చేయాలేదని నిలదీశారు. 

Back to Top