విశాఖలో వైయస్‌ఆర్‌ సీపీ వినూత్న నిరసన

పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌
తాళ్లతో వాహనాలను లాగిన యువజన విభాగం నేతలు
ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
చంద్రబాబు విధించే ట్యాక్స్‌లతో వేగలేకపోతున్నాం
విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం నాయకులు మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలను నిరసిస్తూ యువజన విభాగం విశాఖ అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. వాహనాలను తాళ్లతో కట్టి లాగుతూ... ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ రూ. 45 ఉండే డీజిల్‌ను రూ. 75కు పెంచారని, ఇంచుమించు పెట్రోల్, డీజిల్‌ ధరలు ఒకే స్థాయిలో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర వైఖరితో సామాన్యులు బండ్లపై తిరిగే పరిస్థితి లేదన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగేలా పాలన అందిస్తామని చెప్పిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ప్రజల వైపు చూడకుండా.. ప్రజల అవసరాలను గుర్తించకుండా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలకంటే సుమారు 5 రూపాయలు అధికంగా పెట్రోల్, డీజిల్‌ను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ట్యాక్స్‌లు విధిస్తూ పేద, మధ్యతరగతి వారిని వాహనాలపై తిరనివ్వడం లేదన్నారు. కేంద్రం రేట్లు పెంచితే.. కనీసం చంద్రబాబు ఆయన పరిధిలో ఉన్న ట్యాక్స్‌లనైనా తగ్గించొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు అనుగూనంగా నడుచుకోకుండా.. వారి నడ్డివిరిచే చంద్రబాబు ప్ర భుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అదే విధంగా చంద్రబాబు విధించిన ట్యాక్స్‌లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top