టీడీపీ వైఫల్యాలను ఎండగడదాం

 


–  25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నూతన యువజన, విద్యార్థి సంఘాల ఏర్పాటు
– వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
అమరావతి: తెలుగు దేశం పార్టీ వైఫల్యాలను ఎండగడుదామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. అమరావతిలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సోమవారం యువజన, విద్యార్థి సంఘాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబుతో కలిసి రాజా మీడియాకు సమావేశంలోని వివరాలను వెల్లడించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో అన్ని వర్గాలకు వైయస్‌ జగన్‌ భరోసా కల్తిస్తున్నారన్నారు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేసేందుకు ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదాతో పాటు ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారన్నారు. ఇంటికో ఉద్యోగం దేవుడేరుగా ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యమిత్రులు, ఆశావర్కర్లను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఇంటికి పంపించారన్నారు. చంద్రబాబు తన కొడుక్కు మాత్రమే మంత్రి ఉద్యోగం ఇచ్చారు తప్ప..మరొకటి లేదన్నారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సొల్లు కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పించలేకపోయారన్నారు. ఇప్పటికి ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారన్నారు. కనీసం ఇప్పుడైనా కళ్లు తెరవాలని సూచించారు. ప్రత్యేక హోదా నినాదాన్ని వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. ధర్నాలు, బంద్‌లు, సభలతో ప్రత్యేక హోదా నినాదాన్ని మారుమ్రోగించారన్నారు. అయితే చంద్రబాబులో ఇంతవరకు చలనం రాలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో  ఆడియో,వీడియో టేపుల్లో రెడ్‌ హ్యాండేడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అవినీతి అనే ఏకైక ఎజెండాతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, మట్టి, రాజధాని భూములు, గుడి భూముల దాకా అవినీతి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా మీ అవినీతి, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠంచెబుతారని హెచ్చరించారు.   వైయస్‌ జగన్‌ ఇదివరకు ప్రకటించిన మేరకు ప్రతి పార్లమెంట్‌కు యువజన, విద్యార్థి సంఘాల నూతన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 25 నియోజకవర్గాలకు కొత్త కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అందరికి ఆదర్శప్రాయుడిగా ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి: సలాంబాబు 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు డిమాండు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులను దగా చేశారన్నారు. రాష్ట్రంలో 1. 45 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పది వేల ఉద్యోగాలు కూడా ¿¶ ర్తీ చేయాలేదన్నారు. ఇటీవల ఐటీ మంత్రి నారా లోకేష్‌ నిర్వహించిన జాబ్‌ మేళాలో 150 మంది నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఉద్యోగం ఇవ్వకుండా రోడ్డున పడేశారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏమైందని, సెంట్రల్‌ యూనివర్సిటీని గాలికి వదలేశారని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండు చేశారు. లేదంటే కేంద్రంలో ఉన్న మీ మంత్రులను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ప్రశ్నిస్తానని ఓట్లు వేయించిన పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడున్నారని ఆయన నిలదీశారు.
 
Back to Top