పంచాయతీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యం

విశాఖ:  త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న పంచాయతీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా  పనిచేయనున్నట్టు ఆ పార్టీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు తెలిపారు. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు   చెప్పారు. పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పార్టీ  పంచాయతీరాజ్‌ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. జగదాంబ జంక్షన్‌ సమీపాన ఉన్న పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో బుధవారం వారితో తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీవీ మాట్లాడుతూ పార్టీ అధినేత  ఆరు జిల్లాలకు పార్టీ పంచాయతీరాజ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. ఈ మేరకు జిల్లా పంచాయతీరాజ్‌ అధ్యక్షులు, ఒక్కో జిల్లాకు నలుగురు సభ్యుల్ని(స్థానికంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్‌గా పనిచేసి అనుభవం ఉన్న వారిని) నియమించామని చెప్పారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుల అనుమతితోనే కార్యవర్గాన్ని నియమించినట్టు చెప్పారు. ఆరు జిల్లాల అధ్యక్షులు, ఆయా జిల్లాల నుంచి ఎంపికైన నలుగురు సభ్యులు రాష్ట్ర స్థాయి బాడీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.  కింది స్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే పార్టీ పనిచేస్తోందన్నారు. వైయ‌స్ఆర్‌  సీపీ తరపున ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టడం, ఇష్టానుసారంగా జన్మభూమి కమిటీలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడమే కాక న్యాయపర అంశాలపై పోరాటం చేస్తామన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.  ముఖ్యంగా ఏడాదిలోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని, కింది స్థాయిలో కష్టపడి పనిచేసి   పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో  పార్టీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర సభ్యులు పైడి విఠలరావు (శ్రీకాకుళం జిల్లా జలుమూరు నియోజకవర్గం),  భువనగండి చంద్రయ్య (విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం)  పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు,  విశాఖ జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం   అధ్యక్షుడు శ్రీకాంత్‌రాజ్,  శ్రీకాకుళం జిల్లా నుంచి అంబటి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా నుంచి గడాల సన్యాసినాయిడు, తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం నుంచి పోసింశెట్టి హరనాథబాబు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. 

Back to Top