భవిష్యత్ రాజకీయాల్లో వైయస్ఆర్‌సీపీ కీలక‌ం

నెల్లూరు :

భవిష్యత్తులో మన దేశ రాజకీయాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే కీలకపాత్ర పోషిస్తుందని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యం అని ఆయన అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారని, అందుకే రాష్ట్ర విభజనకు సోనియా గాంధీ కృషి చేస్తున్నారని మేకపాటి దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా జనతాపేట వైకుంఠపురం, కావలిలో జనదీవెన పేరుతో నిర్వహించిన గడపగడపకూ వైయస్ఆర్‌సీపీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మేకపాటి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25 తర్వాత ‌సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, మే 24 లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న వారికే కేంద్రంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.

విభజనకు అనుకూలంగా లేక ఇచ్చి తెలుగుజాతికి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని ఎవరూ మరిచిపోరని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల తరహాలోనే భారీ మెజార్టీతో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీ పెద్దలకు దిమ్మ తిరిగేలా చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top