‘గ్రేటర్’లో బలమైన శక్తిగా వైయస్ఆర్‌సీపీ

హైదరాబాద్:

తొలిసారిగా గ్రేటర్ హైదరాబా‌ద్‌లో పోటీ చేసిన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌పద్నాలుగు నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఓట్లు పొందగలిగింది. విజయం సాధించకపోయినప్పటికీ ఆయా అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లో‌క్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ బలమైన పట్టు సాధించింది.

కుత్బుల్లాపూర్‌ సెగ్మంట్‌లో 26,973, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 24,347, ఖైరతాబాద్‌లో 23,845 ఓట్లు పార్టీ అభ్యర్థులకు పోలయ్యాయి. కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 21,887, ఎల్బీనగర్‌లో 19,376, ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 16,394, మల్కాజిగిరిలో 14,828, సికింద్రాబాద్‌లో 11,688, జూబ్లీహిల్సు శాసనసభా నియోజకవర్గంలో 10,528 ఓట్లు వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి.

‘గ్రేటర్’ ఎన్నికల కోసం కసరత్తు
సాధారణ ఎన్నికల్లో సత్తా చాటిన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఈ ఏడాది నవంబ‌ర్‌లో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల నాటికి నిర్మాణ పరంగా మరింత పటిష్ట‌ం అయ్యేందుకు కార్యాచరణ రూపొందించడానికి సమాయత్తమవుతోంది. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అభ్యర్థులను బలపరిచిన ఓటర్లందరికీ నగర కన్వీనర్ ఆదం విజ‌య్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత చిత్తశుద్ధితో, దీక్షతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ‘గ్రేటర్’ ఎన్నికల నాటికి వైయస్ఆర్‌సీపీ మరింతగా పుంజుకుంటుందని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top