అన్నదాతల తరఫున ప్రభుత్వంతో పోరాడతాం

ఖమ్మం, 31 అక్టోబర్ 2013:

భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిని నష్టాల పాలైన అన్నదాతలకు న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాటం చేస్తామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ హామీ ఇచ్చారు.‌ వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ఆమె గురువారం ఖమ్మం జిల్లా వరద బాధితులను పరామర్శిస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని కలకోటలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మిర్చి, జొన్న పంటలను ఆమె పరిశీలించారు. రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దెబ్బతిన్న పత్తి మొక్కలను శ్రీమతి విజయమ్మకు రైతులు చూపించి గోడు వెళ్ళబోసుకున్నారు. భారీ వర్షాలతో పంటలు బాగా పాడైపోయాయని, ఆర్థికంగా తాము పూర్తిగా దెబ్బతిన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మధిర ముంపు రైతులను పరామర్శించిన తరువాత శ్రీమతి విజయమ్మ వైరా బయల్దేరి వెళ్ళారు. అక్కడి నుంచి కొణిజర్ల మండలం పల్లిపాడు చేరుకుంటారు. అక్కడ నుంచి ఖమ్మం అర్బన్ మండలం వి.వెంకటాయపాలెం‌, ఖమ్మం మీదుగా ముదిగొండ మండలం వెంకటాపురం చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అనంతరం నేలకొండపల్లిలో మునిగిపోయిన పంటలను పరిశీలించి మధ్యాహ్నానికి శ్రీమతి విజయమ్మ నల్గొండ జిల్లా పర్యటన కోసం కోదాడ చేరుకుంటారు.

Back to Top