హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల చివర్లో వచ్చే బడ్జెట్ ఓటింగ్ కు వైఎస్సార్సీపీ సర్వ సన్నద్ధమయ్యింది. మంగళ, బుధ వారాల్లో జరిగే ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా పార్టీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని వైఎస్‌ఆర్‌సీపీ విప్ అమర్‌నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే విప్ జారీ చేసి, అందించినట్లు ఆయన వివరించారు. పార్టీ విప్ అమర్ నాథ్ రెడ్డి ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులందరూ సభకు హాజరై.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రత్యేక లేఖ ద్వారా వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం స్పీకర్ కు ప్రత్యేకంగా తెలియపరిచింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా... సభకు హాజరు కాకపోయినా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లవుతుందని అన్నారు. వారం క్రితమే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా సభ్యులు అందరికీ తెలియచేసినట్లు అమర్ నాథ్ రెడ్డి స్పష్టం చేశారు.