పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలి: జగన్ విప్

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు పార్టీ సూచించిన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున పార్టీ విప్‌ జారీ చేసింది. పార్టీ సూచించిన మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, నగర పాలక సంస్థల అధ్యక్ష, చైర్మ‌న్, మేయర్‌ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఆ విప్‌లో స్పష్టంచేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరలేపిందని ఆదివారంనాడు పార్టీ ఒక ప్రకటనలో విమర్శించింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభాలకు గురిచేసో, బెదరించో స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయించుకునే నీచ రాజకీయానికి ఆ పార్టీ ఒడిగడుతోందని ఆరోపించింది. ప్రజాభీష్టాన్ని తోసిరాజని తమ అభ్యర్థులను గెలిపించుకుని పబ్బం గడుపుకోవడం కోసం నైతిక విలువలు లేకుండా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగింది. ప్రజాభిప్రాజయం మేరకు టీడీపీ దుష్ట చర్యలను తిప్పికొట్టేందుకు వైయస్ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన వారంతా పార్టీ సూచించిన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని తెలిపింది.

Back to Top