గోపాలమిత్రలకు అండగా వైయస్సార్సీపీ

అనంతపురంః కరువు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న గోపాలమిత్రలకు  వైయస్సార్సీపీ అండగా ఉంటుందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట 15 రోజులుగా గోపాల మిత్రలు చేస్తున్న దీక్షలకు  ఆయన మద్దతు తెలిపారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ఇంటికో ఉద్యోగమని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు.  ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగాలలో పని చేస్తున్న 40 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 

వ్యాక్సినేటర్లు, పశుమిత్రుల నియామకాల పేరుతో 16ఏళ్లుగా నిస్వార్థంగా పాడిరైతులకు సేవలు అందిస్తున్న గోపాల మిత్రలను తొలగించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించే విధంగా ఒక్కో పాడి రైతుకు రూ.2లక్షల చొప్పున రుణాలు అందజేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాల మిత్రులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 2014 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఖాళీగా ఉన్న అంధుల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట విభిన్న ప్రతిభావంతులు చేపట్టిన ధర్నాకు మద్దతు ప్రకటించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 
Back to Top