గుంటూరు మేడే వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్‌

గుంటూరు: కార్మికుల సంక్షేమం కోసం తమ పార్టీ పాటుపడుతుందని, వారికి నిరంతరం అండగా నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. తమ పార్టీ పేరులోనే కార్మికులకు పెద్దపీట వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వై అంటే యువజనులకు, ఎస్ అంటే శ్రామికులకు, ఆర్ అంటే రైతులకు నిర్వచనంగా తమ పార్టీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మేడే సందర్భంగా శుక్రవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

పార్టీ నేతలు, వైఎస్సార్ ఆటోయూనియన్ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం వైఎస్సార్‌సీపీ కృషి చేస్తుందని తెలిపారు.

నూతన వధూవరులకు ఆశీర్వాదం
ఇదిలా ఉండగా పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవరాలు, పార్టీ నేత కిలారు రోశయ్య కుమార్తె సాయినివ్య వివాహానికి జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.

ఘన స్వాగతం: వైఎస్ జగన్ రాక సందర్భంగా గుంటూరు నగరంలో పార్టీ నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనకు ఘన స్వాగతం పలికారు.రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ మంత్రులు కె.పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Back to Top