లారీ యాజమానుల సమ్మెకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ లపై రూ. 4 వ్యాట్ విధిస్తుందని మండిపడ్డారు. వెంటనే పెంచిన పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా అదనపు పన్నులు వేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బొత్స అన్నారు. ఇలా ఐతే సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల ఆకలి తీర్చాలే కానీ ఖజనాలు నింపుకోకూడదని బొత్స ఎద్దేవా చేశారు. దీనిలో భాగంగా లారీ , పెట్రోల్ బంకు యాజమాన్యాలు చేపట్టబోతున్న సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

భోగాపురం ఎయిర్ పోర్టుకు తాము పూర్తి వ్యతిరేకమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొంటూ దోపిడీకి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పిన చంద్రబాబు...ఉన్న ఫ్యాక్టరీలను మూసేయిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఈనెల 7 నుంచి తమ అధినేత వైఎస్ జగన్ దీక్ష కొనసాగిస్తారని  బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. ప్రత్యేకహోదా ఇచ్చేది మోడీ ఐనా అడిగేవారెవరని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇక్కడ ఉన్నది చచ్చుప్రభుత్వం, దద్దమ్మలున్నారని నిప్పులు చెరిగారు. 
Back to Top