నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు ఈనెల 28న దేశవ్యాప్త హర్తాళ్ కు వైయస్‌ఆర్‌సీపీ మద్దతుపార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణక్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకు పార్టీ నేతల నివాళి హైదరాబాద్ః ప్రధాని మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు పడే కష్టాలను కేంద్రానికి తెలియజెప్పేందుకు ఈనెల 28న చేపట్టనున్న దేశవ్యాప్త హర్తాళ్ కు వైయస్‌ఆర్ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు, వైయస్ జగన్ అభిమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వెల్లడించారు. నల్లధనం వెలికితీతకు వైయస్‌ఆర్‌సీపీ ఎప్పట్నుంచో మద్ధతిస్తుందని అయితే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నవంబర్ 9 నుంచే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాత్రికేయ సమావేశం కూడా ఏర్పాటు చేసి మాట్లాడారని, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజా సమస్యలను వివరిస్తూ నవంబర్ 23న ప్రజా సమస్యలపై ప్రధాని మోడీకి లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఇప్పటికే 18 రోజులు గడిచినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఢిల్లీకి తెలియజేసేందుకే బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. నోట్లను రద్దు చేసి నల్లకుబేరుల గుండెల్లో వణుకు పుట్టిస్తారనుకుంటే సామాన్యుల గుండెల్లో పిడిబాకులు దిగాయని ఆరోపించారు. ప్రధాని నిర్ణయం సరైనదే అయినా అమలు సరిగా లేనప్పుడు ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.
ఫిడెల్ క్యాస్ట్రోకు నివాళి..క్యూబా విప్లవకారుడు, మాజీ ప్రధాని, అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతిపట్ట భూమన కరుణాకర్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి విప్లవ ప్రపంచానికే తీరని లోటన్నారు. విప్లవ వీరులకు ఆయన చూపిన మార్గం ఆచరణీయం అని కొనియాడారు.