విశాఖ బీచ్ లో విద్యార్థుల జలదీక్ష...!

హిప్నాటిజంతో మోసం చేస్తున్నారు..!
ప్రధానితో హోదా ప్రకటన చేయించాలి..!
విశాఖపట్నంః  ప్రజా సమస్యలను గాలికొదిలేసి  రాజధాని పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి కార్యక్రమాలపై  విద్యార్థులు,యువత మండిపడుతున్నారు. వెంకన్నసాక్షిగా  ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించిన ప్రధాని, చంద్రబాబులు మోసం చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ వైఎస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ లో జలదీక్ష చేపట్టారు. ఈసందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పందికొక్కుల్లాగా దోచుకునేందుకే టీడీపీ నేతలు ప్రత్యేకహోదాను పక్కనబెట్టి ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఆంధ్రుల గుండెకయతో ఆటలొద్దు..!
రాష్ట్ర ప్రజలను హిప్నాటిజం చేసి రాజధాని తప్ప ఇంకేమీ వద్దన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వారు ఫైరయ్యారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబులు ప్రత్యేకహోదా ఏమన్నా సంజీవనా అంటూ అవహేళన చేస్తున్నారని..అది ఐదుకోట్ల ఆంధ్రుల గుండెకాయ అని వారు తేల్చిచెప్పారు. విద్యార్థులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. టీడీపీ, బీజేపీలతో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు నాటకాలు ఆడడానికి ఇది సినిమా స్క్రీన్ కాదని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రధానిచేత ప్రత్యేకహోదా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. 

కుంభకోణాలు,ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకం..!
సీఆర్డీఏ ఓ సంస్థ కాదని చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటి అని విద్యార్థులు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ధరలు మండుతున్నాయి. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఐనా చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల్లో ప్రజల ప్రాణాలు బలిగొన్న మాదిరిగా..వేలాది కుటుంబాల రైతులను మోసం చేసి రాజధాని నిర్మించడంపై విరుచుకుపడ్డారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని...ప్రభుత్వం చేసే కుంభకోణాలు, ల్యాండ్ మాఫియాకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. 
Back to Top