రోడ్డు ప్రమాదంలో వైయస్సార్సీపీ విద్యార్థి నాయకుడు మృతి

ధర్మవరం(అనంతపురం): తమిళనాడులోని దిండిగల్ సమీపంలో వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఏపీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి మృతిచెందారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయనతోపాటు విద్యార్థి విభాగం నేతలు కారులో శబరిమలైకి బయలుదేరారు. తమిళనాడులోని దిండిగల్ వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని వారి వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డితోపాటు కారు డ్రైవర్ మోహన్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు.

కారులో ఉన్న అనంతపురం జిల్లా వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం కార్యదర్శి అమర్‌నాథ్‌రెడ్డి, వినయ్‌గౌడ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్పంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను దిండిగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, నర్సింహారెడ్డి ప్రస్తుతం ఎస్‌కే వర్సిటీలో పీజీ చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే వైయస్సార్‌కాంగ్రెస్ విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయన స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లె.
Back to Top