గిరిజనంపై చంద్రబాబు చిన్నచూపు

డెంగీ, మలేరియాతో రోజుకు పదుల సంఖ్యలో మృతి
తమ కష్టాలు చెప్పుకొని జననేత ఎదుట కన్నీరుపెట్టుకున్న గిరిజనం
గిరిజన ప్రాంతాల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలిచిందని చంద్రబాబుకు ద్వేషం
తూర్పుగోదావరి: ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ వ్యాధితో ప్రజలు చనిపోతున్నా.. చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టి గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గిరిజనులతో కలిసి ప్రజా సంకల్పయాత్రకు తరలివచ్చారు. సోమేశ్వరం వద్ద పాదయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి ఏజెన్సీ ప్రజలతో కలిసి సమస్యలను వివరించారు. డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధులతో రోజుకు పదుల సంఖ్యలో గిరిజనం మృత్యువాత పడుతున్నారని వాపోయారు. అయినా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ గిరిజనులు వైయస్‌ జగన్‌ ఎదుట కన్నీరుపెట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, ఒక్క సంవత్సరం ఓపిక పడితే మన ప్రభుత్వం వస్తుందని, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా పాలన చేస్తానని హామీ ఇచ్చారు. 
రోజుకు వందల మంది చనిపోతున్నా.. కనీసం జిల్లా అధికారులకు, ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్లు కూడా లేదని శెట్టి గంగాధర్‌ మండిపడ్డారు. ప్రభుత్వానికి గిరిజనులంటే చిన్నచూపని ధ్వజమెత్తారు. దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో గిరిజనులు ఎంతో బాగుపడ్డారని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతంలో మెడికల్‌ క్యాంపులు పెట్టి సరైన వైద్యం అందించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు గెలిచారని గిరిజనుల మీద చంద్రబాబు ద్వేషం పెంచుకొని కనీస కనికరం కూడా చూపడం లేదన్నారు. తాగునీరు లేక కలుషిత జలాలు తాగి అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఈ విషయాలన్నీ వైయస్‌ జగన్‌కు చెప్పుకోవడానికి వచ్చామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన ప్రాంత ప్రజలను అభివృద్ధి చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. 
 
Back to Top