నరేంద్ర మోదీ-బాబు జోడి ఏం ఒరగబెట్టారు?

విజయవాడ:  నరేంద్ర మోదీ-బాబు జోడి అధికారంలోకి వచ్చి, రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని  వైయ‌స్ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. నాలుగేళ్లు కేంద్రానికి ఊడిగం చేసింది ఎవరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై  మండిపడ్డారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత సూపర్‌ ప్యాకేజీ ఇచ్చారంటూ మోదీకి ధన్యవాద తీర్మానాలు చేసింది ఏపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.  లస్కర్‌ పని చేస్తూ ప్రాజెక్టులు జాతికి అంకితం అంటే నమ్మేదెవరన్నారు.  ప్రాజెక్టులను నిర్మించాలని తానే కలలు కన్నట్టు.. తానే శంకుస్థాపనలు చేసి పూర్తి చేసినట్లు, వాటిని ఎన్నికల సమీపిస‍్తున్న తరుణంలో జాతికి అంకితం ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తారనే విషయాన్ని తమ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ ఎప్పుడో ఊహించి చెప్పారని సుధాకర్‌ బాబు ఈ సందర్భంగా పేర‍్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి చేపట్టి 80-90 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి, నీళ్లు వదిలి దానికి జలహారతి కార్యక్రమం అంటూ పేరు పెట్టి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. ఎవరికైనా ఊడిగం చేయాల్సి వస్తే.. ఎవరికైనా దాసోహం చేయాల్సి వస్తే.. ఎవరితోనైనా లాలూచీ పడాల్సి వస్తే.. ఎవరి కాళ్ళు అయినా పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆ అవసరం ఈ రోజు ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు.


Back to Top