అన్యాయం జరిగినా నోరెత్తవేం బాబూ

* విభజన చట్టంలోని హామీలపై కేంద్రాన్ని నిలదీయ్‌
* బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగితే సంబరాలా 
* ప్యాకేజీ మాటలు పక్కనెట్టి హోదా కోసం కదులుదాం రా
* చంద్రబాబుపై కొలను పార్ధసారధి ఆగ్రహం
బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగకపోయినా ఏదో అద్భుతం చేసేసినట్టు ముఖ్యమంత్రి సహా టీడీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు పార్ధసారధి మండిపడ్డారు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులకు అర్ధంకాని బ్రహ్మపదార్ధం చంద్రబాబుకు ఏమర్థమైందో తెలియడం లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో ప్రస్తావించిన ఏ ఒక్క హామీనైనా కేంద్రమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం అసంతృప్తి వ్యక్తం చేయాల్సింది పోయి బడ్జెట్‌ బాగుందని స్వీట్లు పంచుకుని, టపాసులు కాల్చుకోవడం ప్రజల చెవుల్లో పూలు పెట్టడమేనని విమర్శించారు. 
ప్రజా రాజధానిని ఎలా నిర్మిస్తారు
అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మిస్తామని చెప్పే మీరు ఈ అరకొర కేటాయింపులతో ఎలా నిర్మిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని పార్ధసారథి డిమాండ్‌ చేశారు. విభజన చట్టం ప్రకారం మనకు హక్కుగా దక్కాల్సిన వాటి కోసం కూడా కనీసం మాట్లాడలేని దౌర్భాగ్యస్థితిలో సీఎం ఉన్నారని ఆరోపించారు. పైగా మోసం జరుగుతున్నా ప్రశ్నించకుండా బాగుందని సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సముద్రం కనిపించిన చోటల్లా పోర్టులు కడతామని చెప్పే మీరు ఈ నిధులతో ఎలా నిర్మిస్తారో చెప్పాలన్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అమరావతిని, ఏపీని అనుసంధానించేలా రోడ్లు వేస్తామని బడాయిలు పోయిన మీరు దానికి బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చూసుకున్నారో అని విమర్శించారు. ఎయిర్‌పోర్టులు, హార్బర్‌లు, అంతర్జాతీయ రాజధాని అని ఊదరగొట్టి చివరకు ఉసూరుమనించారని పేర్కొన్నారు. రైతులకు బ్రహ్మాండంగా మేలు చేసే విధంగా బడ్జెట్‌ ఉందని రాబోయే ఐదేళ్లో వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కృషి చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అయితే అందుకు అనుగుణంగా ఎరువుల్లో సబ్సిడీలు, రుణమాఫీలు లేదా వడ్డీ మాఫీలు తదితరాల్లో ఏదైనా చేశారా అని.. చంద్రబాబూ మీరు ప్రశ్నించరా అని మండిపడ్డారు. పేపర్లో నీరు పారిస్తే పంటలు పండవని పొలాల్లో పారాలని హితవు పలికారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో గతేడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఈ యేడాది 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే లేబర్‌ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య లక్షా ఎనిమిది వేలుగా ఉంటే మీరు ఒక్క ఏపీలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఎలా కల్పించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజానికి మోడీ హయాంలో పారిశ్రామికాభివృద్ధి రెండు శాతం తగ్గిపోయిందని ఇలాంటి నేపథ్యంలో ఉద్యోగాల కల్పన సాధ్యమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ప్రజల్లో చెవుల్లో పూలు పెట్టడం మాని వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పుకుంటున్న మీరు అందులో ఉన్న ఒక్క అంశమైనా అరుణ్‌జైట్లీతో మాట్లాడించగలిగారా అని ఎద్దేవా చేశారు. సాంప్రదాయబద్దమైన జల్లికట్టు ఆట కోసం తమిళనాడు మొత్తం ఏకంకాగా రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ప్రత్యేక హోదా కోసం అందరూ చేతులు కలపలేమా అని ప్రశ్నించారు.
Back to Top