ఆ రెండు పార్టీలే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి


 

–  టీడీపీని బీజేపీ వదిలేసింది, పవన్‌ ఛీ కొట్టారు
– పచ్చ నేతలు చెరువుల్లో మట్టి, ఇసుక తిన్నారు
– చంద్రబాబు రాష్ట్రానికి చేయాల్సినవన్నీ చేసేశారట
– కొన్ని చేయలేకపోవడానికి ప్రధాని, ప్రతిపక్షమే కారణమట
– మహానాడు వేదికగా అబద్ధాలు ప్రచారం
– మోత్కుపల్లి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
– బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజిస్తే.. బీజేపీ, టీడీపీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. నాలుగేళ్లు బీజేపీతో చంద్రబాబు జత కట్టి ఏపీకి తీవ్ర అన్యాయం చేశారన్నారు. మహానాడులో అబద్ధాలు ప్రచారం చేశారని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం అంబటి మీడియాతో మాట్లాడారు. 

–టీడీపీ మహానాడులో ఆ పార్టీకి పచ్చ పండుగగా వర్ణించుకున్నారన్నారు. ఈ మహానాడులో అనేక విషయాలు మాట్లాడారని, చంద్రబాబు ప్రతి రోజు ఏకదాటిగా గంటన్నర పాటు మూడు రోజుల పాటు సుదీర్ఘ ఉపన్యాసాలు చేశారన్నారు. మధ్యలో కొంత మంది కూడా మాట్లాడారన్నారు. బాబు మాట్లాడుతూ..మాటి మాటికి తమ్ముళ్లు హుషార్‌గా ఉన్నారా? లేదా? అవునా? కాదా అంటూ అనుమానం వ్యక్తం చేశారన్నారు. బీజేపీ, పవన్‌ ఇద్దరూ టీడీపీని వీడిపోవడంతో ఆ పార్టీలో మళ్లీ అధికారంలోకి వస్తామా? లేదా అన్న సందేహంలో ఉన్నారన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో అవినీతికి పాల్పడిన పచ్చ తమ్ముళ్లు ఎందుకు హుషారుగా ఉండరని ఎద్దేవాచేశారు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ చేశారట. చేయకపోతే దానికి ప్రతిపక్షం, బీజేపీ కారణమని పేర్కొనడం దారుణమన్నారు.

–వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు తనకు కట్టబెట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు. ఏం చేశావని నీకు అన్నీ స్థానాలు ఇవ్వాలని అంబటి ప్రశ్నించారు. 25 సీట్లు అసెంబ్లీలో వస్తాయని, పార్లమెంట్‌లో మాత్రం కాదని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా వందల దేశాల్లో టీడీపీ మహానాడు జరుపుకుంటారని చంద్రబాబు ప్రకటించిన మరుక్షణమే డల్లాస్‌లో తెలుగు వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని గుర్తు చేశారు. అంతదాకా ఎందుకు..టీడీపీలో పుట్టి, పెరిగిన వ్యక్తి, ఎన్టీఆర్‌తో సహచర్యం చేసిన మోత్కుపల్లినరసింహులు నీ గురించి ఏం మాట్లాడారో విన్నారా చంద్రబాబు అని ప్రశ్నించారు. మోత్కుపల్లి మాటలకు సమాధానం చెప్పే «ధైర్యం ఉందా అని నిలదీశారు. 

– మహానాడులో  ఒక్క నాయకుడు కూడా నిజాలు చెప్పలేదని, జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం మిషన్‌ పనిచేయనప్పుడు చంద్రబాబును విమర్శించారని తెలిపారు. అబద్ధాలు వల్లె వేసే కార్యక్రమంలో టీడీపీ నేతలు మహానాడులో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఎన్‌టీ రామారావుకు, తనకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వచ్చిందంటే మీ వల్లే అని కార్యకర్తలకు పాదాభివందనాలు చేసిన చంద్రబాబు..వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారని వివరించారు. మోత్కుపల్లికి పాదాభివందనం చేసి బయటకు పంపించారని చెప్పారు. లోకేష్‌ మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ యుగపురుషుడు అని అనర్గలంగా చెప్పారన్నారు. ఎన్టీరామారావును భౌతికంగా లేకుండా చేసిన చంద్రబాబును పొగడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది బీజేపీనే అన్నారు. 

– బీజేపీతో నాలుగేళ్లు కలిసి పనిచేసిన టీడీపీని కూడా ప్రజలు క్షమించరని అంబటి రాంబాబు హెచ్చరించారు. కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే..ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా మోసం చేసింది మోదీ, చంద్రబాబే అన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ప్రత్యేక హోదా కావాలని మోదీని అడిగారా అని ప్రశ్నించారు. మోదీకి వైయస్‌ జగన్‌తో సంబంధాలు అంటకట్టడానికి చంద్రబాబు కుట్రలు చేస్తుందన్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. 2014లోనే బీజేపీ మాతో పొత్తుకు ప్రయత్నిస్తే మేం ఒప్పుకోలేదన్నారు. చంద్రబాబు ఓ రాజకీయ కుట్ర చేస్తున్నారని, ఆయన మాటలు వినొద్దని, ఎవరితోనూ వైయస్‌ఆర్‌సీపీ కలువదని, ప్రజల మద్దతు ఉంటే చాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 
 
Back to Top