టీడీపీ నేతలకు చట్టాలు వర్తించవా?



ఎంపీ మాగంటి ఆఫీస్‌ను పేకాట క్లబ్‌గా మార్చారు
రోజుకు రూ.12 కోట్లు చేతులు మారుతుంటే పోలీసులేంచేస్తున్నారు
అన్నపూర్ణ ఆంధ్రను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు
సైబర్, ఆర్థిక నేరాల్లో ఏపీ అగ్రస్థానం
రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు, దళితులపై దాడుల్లో ఫస్ట్‌ ప్లేస్‌
ఈ అరాచకపాలన పోవాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి
హైదరాబాద్‌: చంద్రబాబు పరిపాలనలో ఆంధ్రరాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు అపహాస్యం అవుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. వారికి వారే ప్రత్యేక రాజ్యాంగాన్ని సృష్టించుకొని ఆడిందే ఆటగా అతిదారుణంగా పరిపాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలోనే పేకాట ఆడుతున్నారని, టీడీపీ నేతలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బత్తుల బహ్మానందరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కార్యాలయం పేకాట డెన్‌గా మారి రోజుకు రూ. 12 కోట్లు చేతులు మారుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్యులకు ఒక చట్టం, టీడీపీ నేతలకు మరొక చట్టమా అని నిలదీశారు. కృష్ణ జిల్లా ఎస్పీ కూడా దీనిపై సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 

కృష్ణ జిల్లాలో ఎంపీ మాగంటి పేరుతో పేకాట క్లబ్బులున్నాయన్నారు. విజయవాడ దుర్గమ్మ గుడి స్థలాలను కైంకర్యం చేయడం.. రోడ్డు వెడల్పు పేరుతో 40 దేవాలయాలను కూల్చారు. గుంటూరులో సదావర్తి భూములను కాజేసే ప్రయత్నం.. ఈ కుట్రల్లో తెలుగుదేశం ప్రభుత్వం అక్రమార్కులకు అండగా ఉండి నిడిపిస్తుందని బత్తుల విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వోను, కానిస్టేబుల్‌పై చెయ్యి చేసుకున్న చింతమనేనికి శిక్షలు లేవు, జేసీ బ్రదర్స్‌కు శిక్షలు లేవు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి శిక్షలు లేవు. ఏపీలో రాజ్యాంగానికి టీడీపీ తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. 

అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని బత్తుల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లాండ్‌ ఆర్డర్, చట్టాన్ని అమలు చేసే ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు, దళితులపై దాడుల్లో ఏపీ ముందంజలో ఉందన్నారు. సైబర్, ఆర్థిక నేరాలు, మహిళలపై దాడుల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. అంతే కాకుండా ప్రభుత్వమే మనుషులను చంపే పరిస్థితులకు దిగజారిందన్నారు. అందుకు గోదావరి పుష్కరాల్లో 30 మంది మరణాలు, తమిళనాడు కూలీలను చంపించడమే నిదర్శనమన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలకు సంబంధించి నేరాల్లో ఏపీ పదోస్థానంలో ఉందన్నారు. అంతే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా శాసనసభ్యులను లాక్కోవడం, ఎంపీలను తీసుకెళ్లి టీడీపీ కండువాలు కప్పడం ఇంత దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలో చూడలేదన్నారు. ఈ నియంతృత్వ ధోరణి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజల చైతన్యంతోనే సాధ్యమన్నారు. వాస్తవ పరిస్థితులు గ్రహించి ప్రజలంతా చంద్రబాబు అరాచక పాలనను అడ్డుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తికి పట్టం కట్టాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top