ఇది చంద్రబాబును కాపాడేందుకు ఇచ్చిన రిపోర్టు
– సోమయాజులు కమిషన్‌ నివేదిక చంద్రబాబు రాసినట్టు ఉంది 
– ముఖ్యమంత్రి ప్రచార యావ వల్లే ఈ ఘోరం జరిగింది
– తప్పంతా ప్రజలదే అన్నట్లుగా రిపోర్టు ఇవ్వడం దారుణం
– నాడు కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఏమైంది?
– సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ నివేదిక  ఇచ్చారు
– సీఎం స్నానం చేసే దృశ్యం కోసం లక్షలాది రూపాయలతో డాక్యుమెంటరీ
– ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారు?


హైదరాబాద్‌:  గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పేందుకు ఇచ్చిన రిపోర్టే సోమయాజులు కమిషన్‌ నివేదిక అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాట విషయంలో ప్రభుత్వ బాధ్యతారహితాన్ని ఇవాళ ఒక నివేదిక రూపంలో చూస్తున్నామన్నారు. సోమయాజులు కమిషన్‌ నివేదికను చంద్రబాబు రాసి సోమయాజులు అనే వ్యక్తితో సంతకం పెట్టించి ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.  సోమయాజులు కమిషన్‌ నివేదికలో ప్రజలు ఇంగితం లేకుండా ఒక గుడ్డి నమ్మకంతో పుణ్య స్నానాలకు ఎగబడి వచ్చారన్నట్లుగా పేర్కొనడం బాధాకరమన్నారు. మీడియా, మతాధిపతులు పుణ్యస్నానాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించలేదు అన్నట్లుగా చెబుతున్నారన్నారు. మూఢవిశ్వాసం, గుడ్డి నమ్మకంతో జరిగిన తొక్కిసలాటగా చిత్రీకరించారన్నారు. హద్దుమీరిన ఉత్సాహం, ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిందంటూ ముక్తాయింపు ఇవ్వడం దారుణమన్నారు. ఇలాంటి విషయాలను పరిశీలిస్తే..ఇది కమిషనేనా? లేక చంద్రబాబుకు కాపాడే కమిటీనా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రజలు ప్రాణాలు కొల్పొతే దానిపై సత్వర నివేదిక ఇవ్వాల్సింది పోయి కమిషన్‌ ఇన్ని రోజులు తాత్సారం చేసిందన్నారు. మూడేళ్ల తరువాత ఇచ్చిన కమిషన్‌ నివేదికను ఇవాళ అసెంబ్లీలో చదువుతున్నప్పుడు యావత్తు ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం నిర్ఘాంతపోయిందన్నారు. ఈ రకంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి చేయగలుగుతారా అన్నది దేశంలోనే చర్చనీయాంశంగా మారిందన్నారు. ఎప్పుడు, ఏ కమిషన్‌ కూడా ఇలాంటి దౌర్భాగ్యపు నివేదిక ఇచ్చి ఉండదన్నది అక్షర సత్యమన్నారు. కమిషన్‌ అన్నది అసలు ఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులు ఎవరన్నది ప్రాథమికంగా తీసుకోవాల్సిన అంశమన్నారు. ఘటన ఎందుకు జరిగిందని చెప్పడానికి తప్పుడు భాష చెప్పారన్నారు. ఈ ఘటనకు బాధ్యులు భక్తులు, మీడియా అని నెపం వేరేవారిపై నెట్టారన్నారు. 
ముఖ్యమంత్రి ప్రచార యావ వల్ల జులై 14, 2015లో జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోతే..మరుసటి రోజు జులై 15న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికలో రెండు రాష్ట్రాల నుంచి భక్తులు పుష్కరఘాటుకు అధిక సంఖ్యలో వచ్చారని, వారంతా కూడా స్నానాలు చేసేందుకు క్యూలో నిలబడ్డారన్నారు. ఇంతమంది వేచి ఉంటే సీఎం ఉదయం 6.30 గంటలకు పుష్కర ఘాట్‌కు వచ్చి ఆయన స్నానం చేసేంతవరకు కూడా ఎవరిని అనుమతించలేదన్నారు. ఉదయం 8.30 గంటల వరకు చంద్రబాబు స్నానం చేసి, పుణ్యప్రదాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఒడ్డుకు వచ్చే సమయంలో భారికెడ్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. జనాలను అదుపు చేయలేకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని, అందుకే 30 మంది ప్రాణాలు కొల్పొయారని కలెక్టర్‌ నివేదికలో ఉందన్నారు. ఆ రోజు తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ కూడా తొక్కిసలాట జరిగిందని సీఎంకు చెప్పినట్లు ఆయన మీడియాతో చెప్పారని గుర్తు చేశారు. ఇన్నీ ఆధారాలు ఉన్నప్పుడు సోమయాజులు కమిషన్‌ నివేదిక ఇందుకు విరుద్ధంగా చెబుతోందని తప్పుపట్టారు. సంఘటన జరిగినప్పుడు సీఎం ఆక్కడ లేడని, చంద్రబాబుకు సంబంధం లేదని నివేదిక ఇవ్వడం దుర్మార్గమన్నారు. గోదావరి పుష్కరాలలో 30 మంది మరణానికి కారణం చంద్రబాబే అన్నారు. ఇవన్నీ కూడా ఆయన చేసిన హత్యలే అన్నారు. నేషనల్‌ జీయోగ్రఫీ చానల్‌తో షార్ట్‌ఫిల్మీం షూటింగ్‌ చేయించుకున్నారని, సినిమా డైరెక్టర్‌ బోయపాటి శ్రీనివాస్‌తో ఓ యాడ్‌ చిత్రీకరించారన్నారు. సీఎం స్నానం చేసే సమయంలో లక్షలాది మంది జనం పక్కన ఉన్నారని కెమెరాల్లో చూపించేందుకు భక్తులను కట్టడి చేశారన్నారు. పుష్కరాలకు ముహూర్తం పెట్టిందే చంద్రబాబు అన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్‌కు చంద్రబాబు స్వయంగా లేఖలు రాశారని గుర్తు చేశారు. పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. పుష్కర స్ఫూర్తిని చంద్రబాబు దెబ్బ తీశారన్నారు. ఇంత ప్రచారం చేసిన ముఖ్యమంత్రిని తప్పు కాదని నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. ప్రజలకు ఇంగితం లేదు అని రాయడానికి సోమయాజులుకు చేతులు ఎలా వచ్చాయని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసిన నిర్వాకం వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత అన్నది లేకపోవడం విచారకరమన్నారు. సామాన్య భక్తులు స్నానం చేసే పుష్కర ఘాట్‌కు సీఎం కావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. సీఎం వీఐపీ ఘాట్లో స్నానం చేసి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని కలెక్టర్‌ చెప్పారన్నారు. 
 
Back to Top