రాష్ట్ర ఆదాయం అంతా ఎటుపోతుంది

మొదటి ఐదు సంతకాలు పరిపూర్ణంగా నెరవేర్చావా బాబూ
నాలుగేళ్లలో చంద్రబాబు దుబారా ఖర్చు రూ. 3 వేల కోట్లు పైనే
ఈవెంట్స్, పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు
ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తున్నావు చంద్రబాబూ
సీఎం ఖర్చు చూసి నేషనల్‌ మీడియా ఆశ్చర్యపోయింది
హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లాలన్నా.. ప్రత్యేక విమానమే
వృథా ఖర్చులపై సమగ్ర విచారణ జరగాలి
హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వనరులన్నింటినీ దోచుకుంటున్నాడని, అసలు రాష్ట్ర ఆదాయం ఎటుపోతుందో చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజు పెట్టిన ఐదు సంతకాలకు దిక్కులేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ. 87 వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీ, రూ. 14 వేల కోట్లకు పైగా ఉన్న డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. నోటికొచ్చిన వాగ్ధానాలు ఇస్తున్నారు.. వీటన్నింటినీ ఎలా నెరవేరుస్తారని టీడీపీని ఎన్నికల సంఘం ప్రశ్నిస్తే అఫిడవిట్‌ వేసి రెవెన్యూ సరిపోతుంది. భవిష్యత్తులో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని, అమలు చేస్తామని గొప్పలు చెప్పరన్నారు. రైతుల రుణాలు రూ. 87 వేల కోట్ల కేవలం రూ. 13 వేల కోట్లు ఇచ్చి మొత్తం రుణమాఫీ చేశామని చెప్పారని, అదే విధంగా డ్వాక్రా రుణాలకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అంతా చేసేసినట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడని మండిపడ్డారు. 

ఇంటింటికీ మంచినీరు ఇవ్వని దౌర్భాగ్య పాలన చేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ఆదాయం ఎక్కడకు వెళ్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ సృజల స్రవంతి ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదన్నారు. రూ. లక్షల కోట్లు అప్పులు చేశారు. మరో పక్క ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. మద్యంపై ఆదాయం విపరీతంగా పెంచుతున్నారు. ఈ డబ్బంతా ఎవరికి ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాగుపడుతున్నారు తప్ప తెలుగువారు ఎవరూ బాగుపడడం లేదని విమర్శించారు. భూముల పంపిణీ, కాంట్రాక్ట్‌ల కేటాయింపులకే కేబినెట్‌ సమావేశం పెడుతున్నారు తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా చర్చించడం లేదన్నారు. కేబినెట్‌ సమావేశాల్లో భూముల పందెరం, కమీషన్లు, కాంట్రాక్టర్లకు పనులు కేటాయింపు, వారి నుంచి కమీషన్లు దండుకోవడం తప్పు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు ఏవీ మిగలకుండా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో చూస్తే టీడీపీ నేల లూటీ కనిపిస్తుందన్నారు. 

చంద్రబాబు దుబారా ఖర్చులు చూసి నేషనల్‌ మీడియా కూడా ఆశ్చర్యపోతుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని పదే పదే చెబుతూ.. అధ్వానంగా పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబులా మరే ముఖ్యమంత్రి ఇంత బాధ్యతరహితంగా ఖర్చులు పెట్టిన దాఖళాలు లేవన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి వెన్నుదన్ను నేనని చెప్పుకోవడానికి, ప్రమాణస్వీకారానికి వెళ్లి ఒక్క రోజు రూ. 8 లక్షలు ఖర్చు చేశారన్నారు. అదే సభకు వచ్చిన మిగిలిన ముఖ్యమంత్రి ఎవరూ కూడా రూ. 2 లక్షలకు మించి ఖర్చు చేయలేదన్నారు. చివరకు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానం ఉపయోగించే స్థితికి చంద్రబాబు వెళ్లారన్నారు. ప్రత్యేక విమానాల కోసమే దాదాపు రూ. 100 కోట్లపైగా ఖర్చు చేశారన్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు చేశారని, మళ్లీ భవన మరమ్మతుల కోసం రూ. 11 వందల కోట్లు విడుదల చేశారన్నారు. ఏం మరమ్మతులు చేశారో కానీ ఇవాల్టికీ లీకేజీల పర్వం కొనసాగుతుందన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ నిర్మాణాల్లో కూడా కక్కుర్తిపడిన అల్పబుద్ధి మనుషులు టీడీపీలో ఉన్నారన్నారు. 
నాలుగేళ్లలో దుబారా ఖర్చులు 
– నాలుగేళ్లలో చంద్రబాబు రూ. 3 వేల కోట్లు దుబారా ఖర్చుకే కేటాయించారని వాసిరెడ్డి పద్మ విరుచుకుపడ్డారు. రాజధాని శంకుస్థాపన పేరుతో రూ. 250 కోట్లతో మొదలైన దుబారా పరంపర ఇంకా కొనసాగుతుందన్నారు. 
– మళ్లీ మళ్లీ రాజధాని శంకుస్థాపనలకు రూ. 100 కోట్లు.  
– హైదరాబాద్‌ సీఎం గెస్ట్‌ హౌస్‌కి, లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌కి రూ. వందల కోట్లు. 
– సీఎం ప్రత్యేక బస్సుకు రూ. ఐదున్నర కోట్లు.
– హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతున్న సమయంలో వారి కుటుంబం మొత్తం పార్కు హయత్‌ హోటల్‌లో ఉండేందుకు ప్రభుత్వ ధనం నుంచి రూ. 30 కోట్లు. ఏం చేసినా అడిగేవారు లేరని, అన్ని మీడియాలు చేతుల్లో ఉన్నాయన్న అహంకార ధోరణి. 
– నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షల పేరుతో పార్టీ తరుపున చేసుకున్న ప్రచారానికి ప్రభుత్వం ఖజానా నుంచి వందల కోట్ల ఖర్చు.
– పోలవరం కట్టేందుకు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు కానీ కట్టేస్తున్నానని ప్రచారం చేసుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి రూ. 25 కోట్లు ఖర్చు చేసి బస్సులు తిప్పుతున్నారు. 
– హ్యాపీ సిటీస్‌ పేరుతో ఈవెంట్‌లు చేయడానికి ఏటా రూ. 61 కోట్లు. ప్రతి ఈవెంట్‌ పేరుతో ఏదో అర్భాటం టీడీపీ మనుషులకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వారి నుంచి కమీషన్లు దండుకోవడం. 
– భాగస్వామ్య సదస్సుల పేరుతో ఇప్పటికే రూ. 150 కోట్లు ఖర్చు చేవారు.. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. కొత్తగా ఉద్యోగాలు కూడా వచ్చింది లేదు. 
– చివరకు జన్మభూమి కార్యక్రమాలకు పార్టీ ప్రచారానికి ఏటా రూ. 125 కోట్లు విడుదల చేయడం. 
– నవ నిర్మాణాల దీక్షల పేరుతో సంవత్సరానికి రూ. 80 కోట్ల ఖర్చు. 
– విదేశీ పర్యటన పేరుతో వేల ఖర్చు చేశారు. దావోస్‌ సదస్సుల పేరుతో చంద్రబాబు చేసే గుట్టంతా బయటపడిందని, దావోస్‌ పేరుతో మార్కెటింగ్‌ చేసుకోవడానికి యాక్టివిటీస్‌ పెంచుకోవడానికి చంద్రబాబు టికెట్లు కొనుగోలు చేసి మరీ టూర్లు వేస్తున్నారు. 
అభివృద్ధి తీరు ఇదేనా.. 
అనుభవం ఉందని చెప్పి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా.. వేల కోట్లు దుబారా ఖర్చు చేస్తారా చంద్రబాబూ అని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. అసలే రాష్ట్రం కష్టాల్లో ఉందని, రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడం లేదని ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వేల కోట్లు వృథాగా ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ బ్రిక్స్‌ పేరుతో వసూలు చేసిన డబ్బు ఏం చేశారని నిలదీశారు. ఒక్కటైనా శాశ్వతభవనం కట్టించారా..? ఎప్పుడు డప్పు కొట్టుకోవడం కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశారని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాధనం ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడం కాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తున్నావు చంద్రబాబూ అని మండిపడ్డారు. దుబారా ఖర్చులు మొత్తం విచారణ చేస్తే టీడీపీ నేతలు అంతా దోషులుగా నిలబడతారన్నారు. 

Back to Top