ప్రజల సొమ్ముతో చంద్రబాబు విదేశీ జల్సాలు

24 సార్లు విదేశీ పర్యటలకు వెళ్లి ఏం సాధించారో చెప్పాలి
తాజా సింగపూర్‌ పర్యటన తెర వెనుక ఆంతర్యమేంటీ?
రియలెస్టేట్‌ వ్యాపారానికి రుచి మరిగి భూములు ధారాదత్తం చేస్తారా
రాజధాని నిర్మాణంలో ఒక్క శాశ్వత ఇటుకైనా పడిందా
అబద్ధాలు, అవినీతిపై లోకేష్‌కు టార్గెట్‌ విధించిన చంద్రబాబు
వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేసిన తండ్రీకొడుకులకు విచారణ ఎదుర్కొనే దమ్ముందా?
ఎమ్మెల్యే రోజాపై బోడే ప్రసాద్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం
తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
హైదరాబాద్‌: విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానం లేకపోయినా ప్రజల డబ్బుతో టికెట్‌లు కొని మరీ వెళ్తున్నారన్నారు. 24 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఒక్క నాలుగు పర్యటనల్లో తాను ఏయే హామీలు ఇచ్చారు.. అందులో ఏయే అంశాలు నెరవేర్చారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. ఎంత మందికి ఉపాధి కల్పించారో.. చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు కొత్త వేషం అన్నట్లుగా విదేశీ పర్యటనలకు వెళ్లడం.. రావడం తప్ప ఆ పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగిందేమైనా ఉందా అని నిలదీశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. 

మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న సందర్భంలో తాజాగా సింగపూర్‌ పర్యటనకు వెళ్లడంతో తెరవెనుక ఏం జరుగుతుందోనని అనుమానంగా ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. రియలెస్టేట్‌ వ్యాపారిలా సింగపూర్‌కు భూమిని ధారాదత్తం చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నారని, ఇప్పటికే రాజధాని నిర్మాణం పేరుతో ల్యాండ్‌ పూలింగ్‌ అని వేల ఎకరాల భూములు సేకరించి రైతుల నోట్లో మట్టికొట్టారని దుయ్యబట్టారు. రైతులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించకుండా చంద్రబాబు రియలెస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని మండిపడ్డారు. రియలెస్టేట్‌ వ్యాపారానికి రుచిమరిగిన చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లి భూమి కావాలంటే నా దగ్గరకు రండీ అని ఆఫర్‌లు ఇస్తున్నారన్నారు. అమరావతి అంతా పూర్తయిపోయినట్లు, రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు.. 14 వందల కిలోమీటర్ల మేర సైకిల్‌ ట్రాక్స్‌ నిర్మించి ఆహ్లాదకర వాతావరణం కల్పించినట్లు చిత్రాలు చూపిస్తున్నారని, అసలు అమరావతిలో ఒక్క శాశ్వత ఇటుకైనా పడిందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. రాజధాని భూమిలో పిచ్చిమొక్కలు మొలకెత్తి చింతమనేని ప్రభాకర్‌ లాంటి వారు గేదెలను మేపుతున్నారన్నారు. 

సేంద్రియ వ్యవసాయం అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెంచి రైతులపై పెనుభారం మోపుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడానికైనా హద్దు ఉండాలని, సేంద్రియ వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారో చూపించాలని నిలదీశారు. విదేశాలకు వెళ్లిన చోటల్లా అక్కడి పరిశ్రమలు వస్తున్నాయి.. సింగపూర్, జపాన్, రష్యా, చైనా లాంటి నగరాలను నిర్మిస్తామని చెప్పారు. 25 సార్లు పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు అందులో 4 పర్యటనల్లో ఏమేం సాధించారో చెప్పగలరా అని నిలదీశారు. చంద్రబాబు కేబినెట్‌ సమావేశాలు కూడా భూ సంతర్పణలకేనన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కొడుకు లోకేష్‌నాయుడుకు టార్గెట్‌ పెట్టినట్లుగా అనిపిస్తుందని వాసిరెడ్డి పద్మ అనుమానం వ్యక్తం చేశారు. రోజు ఎన్ని అబద్ధాలు ఆడుతావు.. ఎంత అవినీతి సొమ్ము సంపాదిస్తావనే టార్గెట్‌ పెట్టినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. అబద్ధాలు, అవినీతికి చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌ అనుకుంటే.. తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్‌ ఎదిగాడన్నారు. ఇంతకు ముందు తెరవెనుక చేస్తున్న దోపిడీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి అవినీతిని లీగలైజ్‌ చేశారన్నారు. 

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే చంద్రబాబుకు, లోకేష్‌కు ఎంత భయమో.. తాజాగా లోకేష్‌ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుందన్నారు. ఆనాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఎదుర్కోలేకపోయారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా.. జైలు అనుభవం అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌పై వస్తున్న ఆరోపణలపై ఒక్క ఎంక్వైరీ ఎదుర్కొనే దమ్ముందా అని లోకేష్‌ను ప్రశ్నించారు. విచారణకు శక్తి లేని అసమర్థులు, స్టేలు తెచ్చుకొని బతుకుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సెన్సార్‌బోర్డు విభాగం పెట్టుకుంటే మంచిదని వాసిరెడ్డి పద్మ అన్నారు. చంద్రబాబు ఉన్న వేదికపై జేసీ దివాకర్‌రెడ్డి బండ బూతులు మాట్లాడారు.. తాజాగా బోడే ప్రసాద్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాపై పచ్చి రౌడీ భాషను ఉపయోగించారు. రోజువారి రౌడీలు బుద్ధా వెంకన్న, అచ్చెంనాయుడు ఇలా అనేక మంది టీడీపీలో ఉన్నారన్నారు. టీడీపీ నేతలు అంతా ఇలా వరుసగా మాట్లాడుతున్నారంటే దీని వెనుక ముఖ్యమంత్రి ప్రోత్సాహం ఉందని తెలుస్తుందని, ఎమ్మెల్యే రోజాపై చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 
 
Back to Top