మోదీకి హోదా సెగ త‌గ‌లకుండా బాబే కాపాడుతున్నారు


హైదరాబాద్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యేక హోదా ఆందోళనల సెగ తగలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపాడుతున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరుతో ఢిల్లీకి వెళ్లి.. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఆయన డీల్‌ కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. హైద‌రాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కథువా, ఉన్నావ్‌ లైంగిక దాడుల ఘటనలపై దేశమంతటా ఆందోళనలు చెలరేగుతుంటే.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మొక్కుబడి ప్రకటనలు ఇచ్చి మిన్నకుండిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రతి ప్రాంతం కథువాలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి మొదలు.. అనేక ఘటనలు జరిగినా.. ఒక్క బాధిత మహిళకు కూడా చంద్రబాబు ఎలాంటి భరోసా ఇవ్వలేదని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలోనూ సమగ్ర విచారణ జరపకుండా టీడీపీ నేతలు, వారి అనుచరులను చంద్రబాబు కాపాడుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
Back to Top