మహానాడు కాదు..దళితుల్ని వంచించిననాడు



– దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరించారు
– చంద్రబాబు దళిత జాతి పట్ల అనేకసార్లు అక్కసు చూపించారు
– మంత్రి ఆదినారాయణరెడ్డి దళితుల పట్ల అవహేళనగా మాట్లాడారు
– వర్ల రామయ్య పబ్లిక్‌గా దళితుడిని తిట్టినా వివరణ కోరలేదు
– మహానాడులో దళితులకు సంబంధించిన తీర్మానాలు చేశారా?
విజయవాడ: అమరావతిలో తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదని..దళితుల్ని వంచించిననాడు అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు.  దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లి నరసింహులును టీడీపీ బహిష్కరించిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దళిత జాతి పట్ల అనేకసార్లు అక్కసు చూపించారని ఆయన మండిపడ్డారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.  దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. టీడీపీ మంత్రులు ఆదినారాయణరెడ్డి కూడా రెండుసార్లు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. దళిత జాతిపై టీడీపీ తక్కువ చూపు చూపుతుందన్నారు. వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌ అయిన తరువాత దళిత విద్యార్థిని పట్టుకొని నడిబజారులో కులం పేరుతో దూషిస్తే ఆయన్ను వివరణ కూడా కొరలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ గురించి ఏమైనా తీర్మానాలు చేశారా అని ప్రశ్నించారు. పొగిడించుకునేందుకు మహానాడు పెట్టుకున్నారా అని నిలదీశారు.

రాజధాని పేరుతో దళితుల భూములు స్వాహా చేశారన్నారు. మీ కుమారుడు లోకేష్‌ ప్రమేయంతోనే భూ దోపిడీ జరిగిందన్నారు. ఏ దళిత సమస్యను మీ మహానాడులో చర్చించారని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మహిళలపై దాడులు చేస్తే కనీసం వాటిని ఖండిస్తూ తీర్మానం చేశారా అని ప్రశ్నించారు. మీతో పాటు ఉన్న మోత్కుపల్లి నిన్ను నరహంతకుడు అని అంటున్నారని, ఈ ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉందా అని నిలదీశారు. చంద్రబాబు వద్ద ఎక్కడా సామాజిక న్యాయం లేదన్నారు. కేబినెట్లోనూ, కేటాయింపుల్లోనూ ఎక్కడా సామాజిక న్యాయం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. పేద నిర్మూలనకు మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ధ్వజమెత్తారు. దళిత జాతికి సంబంధించిన ఏమైనా తీర్మానాలు చేశారా అన్నారు. ఎవరు దళితులను బాగా తిడితే వారికి చంద్రబాబు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. మోత్కుపల్లి ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి అని స్పష్టమైందన్నారు.

ఏప్రిల్‌ 20న పుట్టిన చంద్రబాబు 420 అన్నారు. ఈ తేదీన హిట్లర్‌ కూడా పుట్టారని, ఆయన మాదిరిగానే చంద్రబాబు నిరంకుశంగా పాలిస్తున్నారని మండిపడ్డారు. మీ పార్టీలో 30ఏళ్లు ఉన్న మోత్కుపల్లినే మిమ్మల్ని దొంగ, 420, పిట్టల దొర, నరహంతకుడు, నీచుడు అంటున్నారని, ఆయనకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. మహానాడు వేదికగా వైయస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయించారని, జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. వైయ్‌ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే అది చూసి ఓర్చుకోలేని చంద్రబాబు చోటామోటా నాయకులు మాట్లాడుతుంటే ముసిముసి నవ్వులు నవ్వడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు.

నర్సిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాలలను, మాదిగలను విభజించుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని, అందుకే మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మగ్గిపోతున్న టీడీపీ దళిత నాయకులు ఒకసారి ఆలోచన చేయాలని, అక్కడి నుంచి బయటకు రావాలని కోరారు. లేదంటే మహానాడు వేదికగా చంద్రబాబును నిలదీయాలని సూచించారు. టీడీపీ దళిత నాయకులు బయటకు వచ్చి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. 
 
Back to Top