రాష్ట్రంలో పాలన గాలికి

– 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు
– గొప్పలు చెప్పుకోవడానికి యనమల ప్రయత్నం
– రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది
– నాలుగేళ్లలో కానిది, ఒక్క ఏడాదిలో సాధ్యమవుతుందా?
 – ఆడియో టేపుల్లో చంద్రబాబు వాయిస్‌ 90 శాతం మ్యాచ్‌ అయ్యింది
– చంద్రబాబు..గాలి జనార్ధన్‌రెడ్డి సింగపూర్‌లో కలిసింది వాస్తవం కాదా?


హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలనను గాలికొదిలి రాష్ట్ర వ్యవహారాలను వేరే రాష్ట్రాల రాజకీయాలపైన టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని దాని గురించి మంత్రి యనమల మాట్లాడటం లేదన్నారు. రైతులకు మద్దతు ధర లేక అల్లాడుతుంటే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే హోం మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియో టేపులపై విచారణ చేపట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండు చేశారని, బహుశా చంద్రబాబు ఆడియో టేపులపై కూడా ఆయన డిమాండు చేసి ఉంటే బాగుండేదన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉద్యోగుల విషయమై చర్చించినట్లు ఎక్కడ కనిపించడం లేదన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలి కర్ణాటక గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ముక్కుపచ్చలారని పసిపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే చర్యలు తీసుకోలేని హోం మంత్రి కర్ణాటక రాజకీయాలపై మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. శాఖాపరమైన సమీక్షలు కూడా ఎక్కడా కనిపించడం లేదన్నారు. డీజీపీనే మహిళలపై జరుగుతున్న దాడులపై అసంతృప్తి వ్యక్తం చేస్తే..దాని గురించి హోం మంత్రి ఆలోచించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సోది చెబుతున్నారన్నారు. యనమల రామకృష్ణుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమీక్షించడం లేదన్నారు. ఓటుకు కోట్లు ఆడియో టేపులపై చర్చకు వచ్చినప్పుడు ఆ అంశాలను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర మంత్రులు వేరే అంశాలపై మాట్లాడుతున్నారన్నారు. ఆడియో టేపుల్లో 90 శాతం చంద్రబాబు వాయిస్‌ అని నిర్ధారించారన్నారు. 

అందరిపై విచారణ చేపట్టాలి
గాలి జనార్ధన్‌రెడ్డినే కాదు..చంద్రబాబుపై కూడా విచారణ చేపట్టాలని మేం డిమాండు చేస్తున్నామని పార్థసారధి అన్నారు. గాలి జనార్ధన్‌ రెడ్డి కంపెనీకి మొట్ట మొదట లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోగానే గాలి జనార్ధన్‌రెడ్డి, చంద్రబాబు సింగపూర్‌లో కలిసింది వాస్తవం కాదా అన్నారు. యనమల రామకృష్ణుడు ఈ ప్రభుత్వం గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. 600 హామీలు ఇచ్చి పూర్తిగా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. 

పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లలో లక్ష ఇల్లు  కూడా కట్టలేదని, మిగిలిన ఏడాదిలో 16 లక్షల ఇల్లు కట్టిస్తామంటే ఎవరి చెవిలో పువ్వులు పెడతారని ప్రశ్నించారు. ఇదే చంద్రబాబు ప్రభుత్వం 2003 చివరి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పింఛన్లు 18 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆ పింఛన్లను 73 లక్షలకు పెంచారన్నారు. చంద్రబాబు పాలనలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లేరా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ఎవరైనా చనిపోతే మరోకరికి పింఛన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే అన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయన్నారు.

చంద్రబాబు ధర్మ పోరాటం పేరుతో దగా చేస్తున్నారని పార్థపారధి విమర్శించారు. ఆయన చేసే ధర్మ పోరాట దీక్ష ఎలా ఉందంటే ..జనరల్‌ డయ్యర్‌ జలియన్‌వాలా బాగ్‌లో ఊచకోతలకు నిరసనగా దీక్ష చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో..గాంధీని చంపిన గాడ్సే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలాంటిదే చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష అన్నారు. బీజేపీ, టీడీపీ ఇద్దరు కలిసి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిలో ప్రథమ ముద్దాయి చంద్రబాబు అని విమర్శించారు. అభివృద్ధి ఏమీ చేయలేక, దాని నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారన్నారు. రాజధానిలో నాలుగేళ్లుగా ఏ ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదన్నారు. మాయమాటలు చెప్పి రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. అభివృద్ధికి వైయస్‌ఆర్‌సీపీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. అవినీతిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
 
Back to Top