ముద్రగడ వ్యాఖ్యలు బాధాకరం

–  వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు
– రాజకీయంగా లబ్ధి పొందాలని కొన్ని శక్తుల కుట్ర
 – 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లపై బాబు హమీ ఇచ్చారు
– ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు
– బాబు హడావుడిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు
– వైయస్‌ జగన్‌ హామీ ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు
– కాపు రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు
హైదరాబాద్‌: ఇటీవల జగ్గంపేటలో వైయస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రకరకాలుగా చిత్రీకరణ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా వ్యవహరిసున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. దీనిపై టీడీపీ నాయకులు, చంద్రబాబు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఎవరైతే కాపులకు అన్యాయం చేయాలని భావించారో, ఎవరో కాపు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారో కాపు సోదరులు అర్థం చేసుకోవాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  కాపు రిజర్వేషన్ల అంశంగా చాలా కాలంగా ఉందన్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాయని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి కాపు రిజర్వేషన్ల గురించి చాలా వివరంగా తన మేనిఫెస్టోలో పెట్టారన్నారు. కాపు సామాజిక వర్గానికి గతంలో కంటే మెరుగైన రాజకీయ ప్రాధాన్యత ఇస్తామన్నారని చెప్పారు. కాపు, తెలగ, బలిజ తదితర కులాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారన్నారు. కాపుల్లో ఉన్న ఈబీసీ విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తానని చెప్పారు. పేద కాపు విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తింపజేస్తామన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించి నిర్ణిత కాలవ్యవధిలో బీసీలకు నష్టం లేకుండా సమస్యను పరిష్కరించి, కాపులకు న్యాయం చేస్తామని చంద్రబాబు తమ మేనిఫెస్టోలో పెట్టారన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మేం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని చెప్పారన్నారు. 
– చిన రాజప్పకు ఉప ముఖ్యమంత్రిగా చేశారని, అయితే ఆయనను చూసి సంతోషపడాలో, బా«ధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాజప్ప హోం గార్డును కూడా బదిలీ చేసే అధికార ం లేదని ఆయన చాలా సందర్భాల్లో బాధపడ్డారని గుర్తు చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చుతామన్న చంద్రబాబు నాలుగేళ్లు అయినా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమ బాట పట్టిన తరువాత చంద్రబాబు స్పందించారన్నారు. తునిలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన తరువాత కాపు రిజర్వేషన్లు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయన్నారు. జనవరి 31, 2016న ముద్రగడ గర్జన పేరుతో పిలుపునిస్తే..చంద్రబాబు ఆ తరువాత జీవో విడుదల చేశారన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉండి ఉంటే ఎందుకు అంతవరకు కిమ్మని కూర్చున్నారని ప్రశ్నించారు.
–  కాపు ఉద్యమం తీవ్రతరం అవుతున్న క్రమంలోనే చంద్రబాబు ముగ్గురు కమిటీలను, ఒక కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. మంజునాథ్‌ కమిషన్‌ కాపులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయని చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలని నియమం ఉందని, అంతకు మించి చేయాలంటే సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఒక కొత్త కులానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ఒక అధ్యయనం జరిగిన తరువాత, వెనుకబాటు తనాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. మంజునాథ్‌ కమిషన్‌ రిపోర్టు ఎప్పుడు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు చట్టబద్ధమైన రిపోర్టును ఇస్తే బాగుండేదని, కానీ చంద్రబాబు ఇక్కడ అన్యాయంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్రపూరితంగా చేశారని మండిపడ్డారు. విడివిడిగా నివేదికలు ఇచ్చే అధికారం కమిషన్‌ సభ్యులకు లేదని, సభ్యులంతా సంతకాలు పెట్టి ఇచ్చేదే నివేదిక అవుతుందన్నారు. ఈ రిపోర్టు రాకముందే ఎందుకు హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ప్రశ్నించారు. 
– వైయస్‌ జగన్‌ జగ్గంపేటలో చాలా స్పష్టంగా చెప్పారని అంబటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని ఉన్నాయని, రాష్ట్రం పరిధి లేనివి ఏంటో చెప్పారన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో కాపు కార్పొరేషన్‌కు ఏం చేశారని నిలదీశారు. కేవలం రూ.1300 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలకే న్యాయం చేయలేని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది చేస్తానని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు అన్యాయం చేసింది, వారి గొంతు నులిపింది చంద్రబాబే అని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు తప్పని సరిగా చేస్తామని వైయస్‌ జగన్‌ చెప్పినట్లు వివరించారు. అయితే టీడీపీ నాయకులు వైయస్‌ జగన్‌ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. మమ్మల్ని కించపరిచే కార్యక్రమాలు చేయవద్దని హితవు పలికారు. కాపు రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని, ఈ అంశంపై చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లేందుకు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో కృషి చేస్తుందన్నారు. 
– ఐదేళ్లలో కాపులకు ఎందుకు న్యాయం చేయలేదో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని రాంబాబు డిమాండు చేశారు. తప్పించుకునే విష ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కాపులను బీసీలను చేర్చే అంశంపై శాయశక్తుల పోరాటం చేస్తామన్నారు. 
–ముద్రగడ పద్మనాభం కూడా నిన్న చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అంబటి రాంబాబు అన్నారు. వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చి వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. మా పరిధిలో ఉన్నంత వరకు పోరాటం చేస్తామని, కేంద్రం విషయంలో మీ వెంటే ఉంటామన్నారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు కూర్చుంటే తలుపులు పగుల గొట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. పద్మనాభం సతీమణిపై పోలీసులు దుర్భాషలాడారని, మీ కుమారుడిని చిత్రహింసలు పెట్టారని, ఆ రోజుల్లో వైయస్‌ఆర్‌సీపీ అండగా నిలిచి పోరాటం చేసిందని చెప్పారు. ఉద్యమానికి సంబంధించిన అంశాలను చూపిస్తున్నారని సాక్షి మీడియాను కనిపించకుండా చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. ముద్రగడ ఈ విషయాలను మరచిపోయారన్నారు. మిమ్మళ్ని జైల్లో పెట్టి హింసిస్తే..దాసరి నారాయణ, చిరంజీవి, బొత్స సత్యనారాయణ అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసింది మేం కాదా అన్నారు. మేం ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎన్నో మాట్లాడుతారని, వారందరూ కూడా మిమ్మల్ని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. ఎన్ని నష్టాలైనా? కష్టాలైనా మీకు అండగా నిలిచామన్నారు. వైయస్‌ జగన్‌ నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురిని నిలబెట్టారని ముద్రగడ విమర్శించడం సరికాదన్నారు. మీరు రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదన్నారు. కాపుల విషయంలో చంద్రబాబకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 
 
Back to Top