ఏపీ అధోగతికి బాబే కారణం


ఏపీకి బీజేపీ, టీడీపీ వెన్నుపోటు పొడిచాయి
– రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఈ రోజే తెలిసిందా? 
– ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు అనలేదా?
– హోదా మా హక్కు అన్న వైయస్‌ఆర్‌సీపీని అవహేళన చేశారు
– హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతామని హెచ్చరించారు
– అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
 
విజయవాడ: ప్రత్యేక హోదాకు పాతరేయడానికి యత్నించిన చంద్రబాబును ప్రజలు క్షమిచరని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అధోగతికి చంద్రబాబే కారణమని విమర్శించారు.  నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్లై ఓవర్‌ కట్టలేని చంద్రబాబు..రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా అని ఎద్దేవా చేశారు. ఏపీకి బీజేపీ, టీడీపీ కలిసి వెన్నుపోటు పొడిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరకపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నారని  అన్నారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదాకు పాతరేసిన చంద్రబాబు ఇవాళ అఫిడవిట్‌ అంటు కొత్త అవతారం ఎత్తారని విమర్శించారు.  రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయిందని చంద్రబాబు ఇవాళ పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. ఇదేదో ఇప్పుడే చంద్రబాబుకు తెలిసినట్లుగా ఆయన గావు కేకలు వేస్తున్నారన్నారు. విభజన హామీలు నెరవేర్చకపోవడానికి బాధ్యులు, కారకులెవరని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఒక్కటే రాష్ట్రానికి ద్రోహం చేసిందా? ఎవరి పాత్ర లేదా? చంద్రబాబు పాత్ర ఉందా? లేదా అని ఆయన నిలదీశారు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది బీజేపీ అయితే, దగ్గరుండి వెన్నుపోటు పొడిపించింది మాత్రం చంద్రబాబే అన్నారు. నాలుగేళ్లు చంద్రబాబు కేంద్రంతో కలిసి పరిపాలన చే శారన్నారు. ఈ నాలుగేళ్లలో అనేకమైన వాదనలు వినిపించారన్నారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి వ్యక్తులను నమ్మలా అన్న అనుమానం కలుగుతుందన్నారు. అన్యాయమైన, ద్రోహమైన సమాధానం చంద్రబాబు చెప్పారన్నారు. సెప్టెంబర్‌ 8, 2016లో అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి చేసిన ప్రకటనకు  ఇవాళ అఫిడవిట్‌లో చేసిన వాదనలకు ఏమైనా సంబంధం ఉందా అన్నారు. ఆ రోజు జైట్లీ ప్రకటనను స్వాగతించి, సెప్టెంబర్‌ 9న రాష్ట్ర అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలు చేసింది వాస్తవం కాదా అన్నారు. ఢిల్లీ వెళ్లి వెంకటేశ్వరస్వామి ప్రసాదం ఇచ్చి వారిని శాలువాలతో సన్మానించింది వాస్తవం కాదా అన్నారు. ఆరోజు చేసిన ప్రకటనకు, ఈరోజు అఫిడవిట్‌కు తేడా ఉందా? లేదా అన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమని వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తే ఆ రోజు హోదా కన్నా ప్యాకేజీ అద్భుతమని గొప్పలు చెప్పారన్నారు. ప్రజలకు చెప్పమని ఆ రోజు సందేశాలు పంపింది నిజం కాదా అన్నారు. ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ఆ రోజు అన్న చంద్రబాబు ఈ రోజు మాట మార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టు చేసి ఇవాళ ఊసరవెళ్లి మాదిరిగా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అన్యాయమని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. 
–పోలవరం ముంపు గ్రామాలు మన రాష్ట్రంలో కలిపేలా జీవో ఇవ్వకపోతే సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు భీస్మించుకుని కూర్చున్నామని చెప్పే వ్యక్తి, ఆ రోజు ప్రత్యేక హోదా కోసం ఎందుకు భీస్మించలేకపోయారని ప్రశ్నించారు. నాలుగేళ్లు కేంద్రంతో కొనసాగి, హోదా కంటే ప్యాకేజీ అద్భుతమని గావు కేకలు పెట్టి ఇవాళ దౌర్భగ్యమైన కార్యక్రమాలు చేయడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని, కేంద్రం తీసుకునే నిర్ణయమన్నారు. చంద్రబాబు తీరు వల్లే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ఇవాళ చంద్రబాబు కొత్త అవతారం ఎత్తి హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రం అధోగతి పాలు కావడానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబును ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ప్రభుత్వ ఖర్చులతో ధర్మపోరాట దీక్షలు అంటూ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని చంద్రబాబు గ్రహించాలన్నారు. ఇవాళ అఫిడవిట్లో చేస్తున్న వాదన కొత్తది కాదన్నారు. మా నాయకుడు వైవీ సుబ్బారెడ్డి గతంలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించారన్నారు. ఇదే విషయాలన్ని  ఇవాళ టీడీపీ అఫిడవిట్‌లో పొందుపరిచారన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి మోడీ, చంద్రబాబు ఇద్దరు బాధ్యులే అన్నారు. ఇద్దరు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు.  ఇవాళ బీజేపీతో విడిపోయినంత మాత్రానా మోసం న్యాయం కాదని, ఇందుకు చంద్రబాబు అనుభవించక తప్పదని హెచ్చరించారు. మోడీ అంటే వైయస్‌ఆర్‌సీపీకి అమితమైన ప్రేమ అని, కేసుల మాఫి కోసమే వైయస్‌ జగన్‌ బీజేపీతో స్నేహం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేశారని ఆయన నిలదీశారు. విజయవాడలో నిర్మిస్తున్న ప్లైఓవర్‌ బ్రిడ్జిని ఇంతవరకు పూర్తి చేయలేకపోయారన్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారన్నారు. రాజధానిలో ఒక ఇటుక కూడా పడలేదన్నారు. కేసులంటే వైయస్‌ఆర్‌సీపీకి భయం లేదన్నారు. మీపైన కేసులు పెడతారని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. కర్నాటక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏవేవో మాట్లాడారని, ఎన్నికలు అయిపోయినా ఆయనపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. ప్లానింగ్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు కుటుంబ రావు కుంభకోణం బయటపెట్టేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులంటే భయపడేది చంద్రబాబే అన్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకుంది చంద్రబాబే అన్నారు. మోడీ కోర్టులు మేనేజ్‌ చేస్తారా ? చేస్తే గతంలోని ప్రధానులు కూడా మేనేజ్‌ చేశారా అన్నారు. పనికి మాలిన మాటలు మాట్లాడి వైయస్‌ జగన్‌ను అభాసుపాలు చేయాలని చూస్తే..మీరే అభాసుపాలు అవుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు. 
 
Back to Top