వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్య‌క్ర‌మం ఘనంగా నిర్వ‌హించాలి- ప్ర‌జలకు సువర్ణ పాలనను అందించిన మహానుభావుడు
- మహానేత ప్రస్తానం చిర‌కాలం ఉంటుంది
- వైయస్‌ఆర్‌ మరణవార్త విని వందల గుండెలు ఆగాయి
- మైనార్టీల బతుకులు మార్చి మొదటి, చివరి నాయకుడు
- వైయస్‌ఆర్‌ను ముస్లింలు గుండెల్లో దాచుకున్నారు
-  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
విజయవాడ: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కాలం ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ మరణ వార్త విని తట్టుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొన్ని వందల గుండెలు ఆగిపోయాయని, మరికొందరు వైయస్‌ఆర్‌ లేని జీవితం అవసరం లేదని ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సొంత అన్నను, ఒక తండ్రిని, కుటుంబసభ్యుడిని కోల్పోయినట్లుగా ప్రతి ఒక్కరూ భావించారన్నారు. వైయస్‌ఆర్‌ మరణించాడని విలపించని హృదయం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటీ కూడా ఉండదన్నారు. ఎందరో నాయకులు ముఖ్యమంత్రులుగా చేశారు కానీ ఒక ముఖ్యమంత్రి మరణించినప్పుడు ఇంతగా ప్రజల విలపించిన సందర్భాలు తనకు తెలిసి ఉండవు.. ఉండబోవని అంబటి అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఐదు సంవత్సరాల మూడు మాసాల 18 రోజులు పాటు వైయస్‌ఆర్‌ ఆంధ్రరాష్ట్రాన్ని పరిపాలించారని అంబటి గుర్తు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం గురించి ప్రతీ క్షణం ఆలోచించారు. కూడు, గూడు, బట్ట, విద్యా, వైద్యం, సేద్యం ఇవి రాష్ట్ర ప్రజలకు కావాలని భావించి వాటి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడన్నారు. ప్రజల గురించి ఇంత చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి మరోకరు ఉండరు.. రారూ అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, 108, 104 ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయన్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారంటే అది వైయస్‌ఆర్‌ చలవేనన్నారు. ఆయన మరణం తరువాత తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, అవి వైయస్‌ఆర్‌ వ్యతిరేక ప్రభుత్వాలు అయినా మహానేత ప్రవేశపెట్టిన పథకాలను ముట్టుకోవడానికి భయపడ్డాయన్నారు. అలాంటి మంచి పథకాలను చిత్తశుద్ధితో ఆలోచించి ప్రవేశపెట్టారు కాబట్టే ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా మిగిలిపోయారన్నారు. 

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ మరణం ఆంధ్రరాష్ట్రాన్ని చిందరవందర చేసిందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మహానుభావుడు వెళ్లిపోయి తొమ్మిదేళ్లు అయినా ఇంకా కళ్ల ముందే కనిపిస్తున్నట్లే ఉందన్నారు. మైనార్టీ బతుకులు మార్చిన మొట్టమొదటి నాయకుడు వైయస్‌ఆర్‌ అని, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత ముస్లింల గురించి ఆలోచించిన తొలి, చివరి ముఖ్యమంత్రి ఆయనే అన్నారు. ముస్లింలు ఆర్థిక ఇబ్బందులతో కూలి పనిచేసుకుంటున్న తరుణంలో వారు కూడా ఉన్న విద్య అభ్యసించాలని 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన మహానుభావుడన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడినా.. ఎప్పుడూ వైయస్‌ఆర్‌ హమారా అంటూ సభలు, సమావేశాలు పెట్టలేదన్నారు. కానీ ముస్లిం సోదరులు ఆయన్ను గుండెల్లో దాచుకున్నారన్నారు. 

తన పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్‌ చార్జీలు, పన్నులు పెంచకుండా ప్రజలకు మెచ్చే పరిపాలన వైయస్‌ఆర్‌ అందించారని అంబటి అన్నారు. పోలవరం పునాధి వేసింది మహానేత వైయస్‌ఆర్‌ అన్నారు. పులిచింతల నిర్మాణానికి పునాధులు వేసి పూర్తి చేసిన మహానేత అన్నారు. పోలవరం మేం చేపట్టామని గావుకేకలు వేసే వారంతా ఒకసారి పునరాలోచించాలన్నారు. వైయస్‌ఆర్‌ పుణ్యమే పోలవరం అన్నారు. చిత్తశుద్ధితో కేంద్రంతో పోరాడి అనుమతులు తీసుకొచ్చి కాల్వలు పూర్తి చేశారన్నారు. ఆయన మరణించకుండా ఉంటే పోలవరం పూర్తయ్యేదని, నీటితో ప్రాజెక్టు కళకళలాడేదన్నారు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించకుండా ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని, ఒక చక్కని పరిపాలనతో రాష్ట్రం ముందుకుపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

మహానేత భువి నుంచి దివికి ఎగసి రేపటితో తొమ్మిది సంవత్సరాలు గడుస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో వైయస్‌ఆర్‌ వర్ధంతిని వాడవాడలా ఘనంగా జరపాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు, వైయస్‌ఆర్‌ అభిమానులకు అంబటి పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ అందించిన పాలన వచ్చే విధంగా కంకణం కట్టుకొని ముందుకు సాగాలన్నారు. రాజన్న సువర్ణ పాలన ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమని, వైయస్‌ జగన్‌ను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. 
Back to Top