టీడీపీ అవిశ్వాసం ఆమోదం వెనుక మహా కుట్ర


– పార్లమెంట్‌ వేదికగా టీడీపీ డ్రామాలు
– మోదీ సర్కార్‌పై మొదట అవిశ్వాస తీర్మానం పెట్టింది వైయస్‌ఆర్‌సీపీనే
– మేం అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు అవహేళన చేశారు
– చంద్రబాబు–బీజేపీ మధ్య సయోధ్య!
 – టీడీపీ అవిశ్వాస తీర్మానం ఎందుకు అంగీకరించారో కేంద్రం సమాధానం చెప్పాలి
– నాడు చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీయే మంచిదన్నారు


విజయవాడ: పార్లమెంట్‌లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదించడం పట్ల మహాకుట్ర జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మేం అవిశ్వాస తీర్మానం పెడితే ఆమోదించని కేంద్రం..భాగస్వామ్యపార్టీ అయిన టీడీపీ అవిశ్వాస తీర్మానం ఎందుకు ఆమోదించారో కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. చంద్రబాబు–బీజేపీ మధ్య సయోధ్య జరుగుతుందని, అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపారని అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇవాళ టీడీపీ ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్‌ వేదికగా ఓ పెద్ద డ్రామా ప్రదర్శించాలని ఓ ప్రణాళిక రూపొందించుకుందన్నారు. గతంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ సాక్షిగా ఎన్ని డ్రామాలు ఆడారో మనం చూశామన్నారు. చంద్రబాబు కూడా ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నారో చూశామన్నారు. మొట్టమొదట అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుకు వచ్చింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. అవిశ్వాస తీర్మానంపై మొదట్లో చంద్రబాబు హేళనగా మాట్లాడారన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందనా అని మాట్లాడారని గుర్తు చేశారు. ఆ తరువాత చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని తెలిపారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడుతున్నానని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. 

– ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుందని గతంలో చంద్రబాబు నీరుగార్చారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలు బాగుపడలేదని అన్నట్లు తెలిపారు. హోదా కన్నా...ప్యాకేజీ గొప్పదని, వైయస్‌ఆర్‌సీపీ అవగాహన లేక ప్రత్యేక హోదా కోసం పోరాడుతుందని హేళనగా మాట్లాడారన్నారు. హోదా కోసం పోరాడుతుంటే మాపై కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న చంద్రబాబు ఇవాళ అదే తోలు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే కేంద్రం చర్చకు ఆమోదించిందన్నారు. మొదటి రోజునే స్పీకర్‌ ఆమోదించడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది కుట్రలో భాగమన్న అనుమానం ప్రజలకు కలుగుతుందన్నారు. పార్లమెంట్‌ సాంప్రదాయాలు తెలిసిన విజ్ఞులు, ఏపీ ప్రజానీకం ఈ చర్యలను ఆగి ఆలోచించాలని మనవి చేశారు. మొట్ట మొదట అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వైయస్‌ఆర్‌సీపీనే అని గుర్తు చేశారు. అప్పుడు కూడా యాభై మంది ఎంపీలు మా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారన్నారు. ఈ రోజు మా అవిశ్వాస తీర్మానానికి ఎందుకు అంగీకరించలేదని అంబటి రాంబాబు నిలదీశారు. మేం రాజీనామాలు చేసి బయటకు వచ్చిన తరువాత మాత్రమే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఎందుకు అంగీకరించారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. 
– బుట్టా రేణుకను మా పార్టీ నుంచి చంద్రబాబు కొనుగోలు చేస్తే..ఆమెను మా పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా గుర్తించారని అంబటి రాంబాబు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చంద్రబాబు రాజగురువు అయిన ఓ పత్రికాధిపతితో ఎందుకు రహాస్య సమావేశం ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు.  ఆ చర్చ తరువాత ఈ అవిశ్వాస తీర్మానం అంగీకరించడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు– బీజేపీకి మధ్య సయోధ్య జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మి బీజేపీ ముందుకు వెళ్లాలనే భావన కలుగుతుందన్నారు. మా మాజీ ఎంపీలు రాజ్యసభ సభ్యులతో కలిసి ఆందోళన చేపడుతుంటే వైయస్‌ఆర్‌సీపీ సభ్యులపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. వీరికి ప్రత్యేక హోదా కన్నా..రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రత్యేక హోదాను కాపాడుకుంటూ వచ్చింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదాను బతికిస్తే..దాన్ని చంద్రబాబు ఇవాళ భుజాన పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ పార్లమెంట్‌ వేదికగా మహా కుట్ర జరిగిందన్నారు. నిన్నటిదాకా ఎన్‌డీఏలో కొనసాగిన చంద్రబాబు అవిశ్వాస తీర్మానం చర్చకు అనుమతించడం కుట్రలో భాగమే అన్నారు. 
 
Back to Top