ప్రచార ఆర్భాటానికే గ్రామదర్శిని

ప్రజలు మెచ్చితే.. పథకాలకు ప్రచారం అవసరమా?
చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రజల్లో లేవని అర్థం
వైయస్‌ఆర్‌ పథకాలే ఆయన్ను రెండోసారి సీఎంను చేశాయి
రోజుకో రీతిగా బయటపడుతున్న బీజేపీ, టీడీపీ సంబంధాలు
బీజేపీతో తెరవెనుక రహస్య ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు
ప్రజలను మభ్యపెట్టేందుకు వైయస్‌ఆర్‌ సీపీపై ఆరోపణలు
చంద్రబాబు చరిత్రంతా వెన్నుపోటు రాజకీయమే
హైదరాబాద్‌: చంద్రబాబు చేపట్టిన పథకాలు ప్రజలకు అందడం లేదని గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా తేటతెల్లమవుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గ్రామదర్శిని పేరు మీద ఓ కార్యక్రమం గుంటూరు నుంచి ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారన్నారు. గ్రామదర్శినితో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్నట్లుగా చెబుతున్నారన్నారు. నాలుగు సంవత్సరాల ఆరుమాసాల్లో పథకాలు ప్రజలకు చేరువైతే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మేలు కలిగే పథకం ఏర్పడితే.. ప్రజలే దాన్ని ప్రచారం చేస్తారని, ఏ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టిందో.. అదే ప్ర భుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 108, ఫీజురియంబర్స్‌మెంట్‌ వంటి పథకాలు ప్రవేశపెట్టారని, వేటికి సదస్సులు పెట్టి ప్రచారాలు చేసుకోలేదన్నారు. ప్రజలే వాటిని అర్థం చేసుకొని రెండోసారి ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు. 110 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారని, ఒక్కసారి చంద్రబాబు, లోకేష్‌ ఎవరైనా వాటిని చదివి వినిపించే దమ్ముందా అని నిలదీశారు.

బీజేపీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూనే వైయస్‌ఆర్‌ సీపీపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ సంబంధాలు రోజుకో రీతిగా బయటపడుతూనే ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ప్రచారం చేస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన నాటి నుంచి 1999, 2004, 2014లో బీజేపీతో పొత్తుపెట్టుకుందని గుర్తు చేశారు. గతంలో కూడా ఇప్పటిలాగే పొత్తులు పెట్టుకొనని బీరాలు పలికి.. ఎన్నికలు వచ్చే సరికి బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడన్నారు. ప్రస్తుతం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, బీజేపీ తీరును ఎండగట్టడంతో గత్యంతరం లేక యూటర్న్‌ తీసుకొని పోరాటం చేస్తున్నా.. ధర్మపోరాటం చేస్తున్నానని ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏ పోరాటాలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ప్రజలకు వలయంలా ఉండాల్సిన ముఖ్యమంత్రికి.. ప్రజలే వలయంగా ఏర్పడి రక్షించాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీజేపీ తనపై కక్ష కట్టిందని, కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని భయపడుతూ... పోరాడుతున్నానని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదర్చుకుంటూనే ప్రజలను మరోసారి వంచించేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి సుధీర్‌ ముంగిటివార్‌ భార్య స్వప్న ముగింటివార్‌ను ఎందుకు టీటీడీ బోర్డు మెంబర్‌గా వేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను కమ్యూనికేషన్‌ అడ్వైజర్గా వేసుకున్నారు.. వలయంలో ఈ రెండు పాత్రలే కాకుండా.. అమిత్‌షాను కూడా మూడోవాడిగా చంద్రబాబు చేర్చాడన్నారు.
 
అమిత్‌షా నిన్న  హైదరాబాద్‌కు వచ్చి తెలుగుదేశం పార్టీకి రక్షకుడిగా, సిద్ధాంతకర్తగా, టీడీపీని ఆది నుంచి కాపాడుతూ వచ్చిన ఓ పత్రికాధినేతతో గంటసేపు మంతనాలు జరిపారని అంబటి అన్నారు. చంద్రబాబు తెర ముందు ఒకలా.. తెర వెనుక మరొకలా చీకటి రాజకీయాలు చేస్తున్నారన్నారు. గట్కరీ సమావేశంలో హామీలన్నీ అమలు చేస్తే అపార్థాలు ఉండవనే మాట చంద్రబాబు నోట వచ్చిందన్నారు. హామీలు చివరి ఆరుమాసాల్లో అమలు సాధ్యమవుతుందా చంద్రబాబూ..? రాజకీయ లాలూచీ లేకపోతే ఎందుకు మళ్లీ వంగి వంగి దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన గట్కరీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సంధి కుదుర్చుకునే పరిస్థితిలో ఉన్నారన్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీ ప్రారంభం నుంచి చంద్రబాబు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే వస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్‌ వస్తే సోనియాగాంధీ ఇప్పించారని, అది తల్లి కాంగ్రెస్‌... ఇది పిల్ల కాంగ్రెస్‌ అని మాట్లాడారని, ఇవాళ బీజేపీతో అనుకూలంగా ఉన్నారని దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నాడని ధ్వజమెత్తారు. బీజేపీతో అంటకాగుతూ.. కాంగ్రెస్‌ పార్టీతో కలవాలనుకునేది ఎవరో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబరావు అనే వ్యక్తి బీజేపీ అవినీతి ఆధారాలు నా చేతిలో ఉన్నాయని, బయటపెట్టి మోడీ ప్రతిష్ఠను దిగజార్చుతానని బీరాలు పలికారని, అదే విధంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు నర్సింహరావు తెలుగుదేశం అవినీతిని బయటపెడతానని మాట్లాడారన్నారు. ఏమయ్యాయి అవన్నీ.. మీ మధ్య కుదిరిజన రాజకీయ ఒప్పందాలతో మరుగునపడ్డాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ క్షణంలోనైనా బీజేపీతో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైయస్‌ఆర్‌ సీపీపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో మోడీని నిలదీస్తానని వెళ్లిన చంద్రబాబు మోడీ ఎడమ చెయ్యి పట్టుకొని వంగి వంగి సలాంలు కొట్టాడన్నారు. సమావేశం అనంతరం ప్రెస్‌మీట్‌ కూడా రద్దు చేసుకొని నోరు మూసుకొని హైదరాబాద్‌ వచ్చాడన్నారు. తెరచాటున బీజేపీ కాళ్లు పట్టుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడని, చంద్రబాబు ప్రభుత్వ ధనంతో జల్సా పోరాటాలు చేస్తున్నాడని, రాష్ట్రానికి మేలు చేయాలనే చిత్తశుద్ధి ఏ కోశాన లేదన్నారు. బాబు రాజకీయ జీవితంలో ఎక్కడైనా పోరాటాలు చేసిన దాఖలాలు ఉన్నాయా.. వెన్నుపోటు రాజకీయాలతో పైకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. 
Back to Top