దమ్ముంటే ఆ పని చేయండి.. మీ సంగతేంటో తెలుస్తాం


– ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా?
– తిరుమలలో జరుగుతున్న వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలి

హైదరాబాద్‌: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిలదీశారు. చంద్రబాబుకు దమ్ముంటే..టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులును బొక్కలో వేసి నాలుగు తగిలించండి..మీ సంగతేంటో ప్రజలే తేలుస్తారని ఆయన హెచ్చరించారు. రమణదీక్షితులపై  మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అంబటి రాంబాబు ఖండించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో సిబ్బంది నల్ల బ్యాడ్జిలు పెట్టుకొని నిరసన తెలిపారని, అది చాలా అపచారమైన కార్యక్రమన్నారు. టీటీడీ సన్నిధిలోనే నిరసనలు తెలిపితే పరిస్థితి ఏంటని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. కొండ మీద రాజకీయాలు మాట్లాడటం సరైంది కాదని మేం భావించేవాళ్లమన్నారు. ఇవాళ చాలా చిత్రంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చిత్రమైన వ్యాఖ్యలు చేశారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ, బీజేపీ కలిసి మాట్లాడుతున్నారని పేర్కొనడం దారుణమన్నారు. రమణదీక్షితులను బొక్కలో వేసి రెండు తగిలించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందా అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైల్లో పెట్టే సంస్కృతికి దిగారన్నారు. రాష్ట్రంలో పాలన చేస్తున్నారా? పశువులను కాస్తున్నారా అని నిలదీశారు. రమణ దీక్షితులను బొక్కలో వేయండి మీ అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రజల నుంచి గెలవలేని వ్యక్తి..అడ్డదారిలో మంత్రి అయిన సోమిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులను బలవంతంగా అరెస్టు చేశారని గుర్తు చేశారు. చట్టప్రకారంగా ఎవరికి తగిలించాలని ప్రశ్నించారు. టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐ విచారణ చేపడితే ఎవరిని బొక్కలో వేయాలో తేలుతుందన్నారు. కేంద్రం చంద్రబాబును బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే ఆయనే నిజాలు చెబుతారని అంటున్నారని తెలిపారు. ఎవరు ఎదురు తిరిగితే వారిపై ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్లు మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. వేంకటేశ్వరస్వామి టీడీపీ నేతలకు తగిన శాస్తీ చేస్తారని హెచ్చరించారు. దమ్ముంటే రమణదీక్షితులుపై చేయి వేయ్యండి మీ సంగతి ప్రజలే తేల్చుతారని హెచ్చరించారు. తక్షణమే సోమిరెడ్డి క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.
 
Back to Top