పొత్తులు పెట్టుకోవడమే బాబు ఎజెండా

– సొంతంగా పోటీ చేసే ధైర్యం ఆ పార్టీకి లేదు
– 46 ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ 
– సగం ఎన్నికలో ఆ పార్టీకి డిపాజిట్‌లు గల్లంతు
– బాబు నిజస్వరూపం ప్రజలు, పార్టీలు గుర్తించారు
– నవ నిర్మాణ దీక్షలతో ప్రజలకు ఒరిగేదేం ఉండదు

చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుండా ఏనాడూ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భాలు లేవని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009, 2014 మధ్య జరిగిన 46 ఉప ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిందని తెలిపారు. అందులోనూ 23 ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని.. కానీ టీడీపీకి పొత్తులు పెట్టుకోవడమే సిద్ధాంతమని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుందని అంబటి రాంబాబు గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో అలాంటి పొత్తు కోసమే చంద్రబాబు.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ ముందుకు రారని చెప్పారు.. వచ్చే నెల 2వ తేదీ నుంచి చంద్రబాబు చేపట్టనున్న నవ నిర్మాణ దీక్ష, సంకల్ప దీక్షపై పలు విమర్శలు చేశారు. అన్ని టీవీ చానళ్లకు హుకుంలు జారీ చేసి తన ప్రసంగాలను ప్రసారం చేయాలని చేయడం తప్ప చేసేదేం లేదని ఎద్దేశా చేశారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉండి ఏం చేయలేని చంద్రబాబు.. మైకులు పట్టుకుని బీజేపీ మీద నిందలు మోపడం, వారిని తిట్టడం తప్ప ఏమీ చేయరని విమర్శించారు. బాబు నిజ స్వరూపం బట్టబయలైందని అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయం ప్రజలకు, రాజకీయ పార్టీలకు అర్థమైందన్నారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో మట్టి, ఇసుక, భూమి అమ్ముకున్న చంద్రబాబు.. ఫ్యూచర్‌ గ్రూపు, రిలయన్సులను అడ్డం పెట్టుకుని రాబోయే రోజుల్లో మరో కొత్త కుంభకోణానికి తెరతీశారని చెప్పారు. మిగిలి ఉన్న ఏడాది రోజులైనా ప్రజలకు మంచి పాలన అందించాలని హితవు పలికారు. 
 

Back to Top