బాబు ధర్మ పోరాటంలో ధర్మం లేదు– సీఎం ప్రసంగానికి జనం నుంచి స్పందన లేదు
– జనాన్ని బలవంతంగా ధర్మ పోరాటానికి తరలించారు
– బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీకి ముడిపెట్టే విష ప్రయత్నం మానుకోవాలి
– చంద్రబాబు కన్నా నమ్మక ద్రోహి ఎవరైనా ఉన్నారా?
విజయవాడ: చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షలో ధర్మమే లేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల ప్రచార సభకు ధర్మ నపోరాటం అని పేరు పెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన పుట్టిన తేదీ ఏప్రిల్‌ 20న తిరుపతిలో ధర్మ పోరాటం అని బహిరంగ సభ పెట్టి ఒక్క రోజు  దొంగ దీక్ష చేశారన్నారు. నిన్న విశాఖలో కూడా ధర్మ పోరాటం పేరుతో ప్రజాధనంతో ఆర్భాటంగా నిర్వహించారన్నారు. నాడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు నష్టపోయాయని చెప్పిన చంద్రబాబు ..ప్రత్యేక ప్యాకేజీ అద్భుతం అంటూ అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనను స్వాగతించి, మరుసటి రోజు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారన్నారు. ఈ వీడియోలు ధర్మ పోరాటం దీక్షలో ప్రజలకు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. బీజేపీది మాత్రమే చూపించి..టీడీపీ వ్యాఖ్యలను చూపించకపోతే దాన్ని ధర్మ పోరాటం అని ఎలా అంటారన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో తమ్ముళ్లూ..అవునా..కాదా అంటూ తానే అనుమాన పడేవిధంగా వ్యవహరించారన్నారు. మరోసారి బొబ్బలి సింహంలా విరుచుకుపడండి, తాండ్రపాపారాయుడిలా విజృంభించండి అంటూ పిలుపునిస్తే..తమ్ముళ్లలో సూయ్‌ లేదు..సై లేదని ఎద్దేవా చేశారు. నిన్న మీటింగ్‌లో చంద్రబాబు గావ్‌ కేకలు మాత్రమే ఉన్నాయని, పనికొచ్చే  ఒక్క మాట లేదన్నారు. భూతద్దం పెట్టి ఎంత వెదికినా చంద్రబాబు ధర్మ పోరాటంలో ఎక్కడా ధర్మం లేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో జనాలను బలవంతంగా ఎక్కించుకొస్తే..దాన్ని పోరాటం అంటారా అని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు విమర్శించడం మంచిదే..అయితే మోడీతో పాటు చంద్రబాబు కూడా ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు. మోదీతో వైయస్‌ జగన్‌ను జత కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్నాళ్లు మోదీ, పవన్‌తో కలిసి ప్రయాణం చేసిన చంద్రబాబు ఇవాళ వారితో విడిపోయి వైయస్‌ఆర్‌సీపీని వారితో కలిపి విమర్శించడం దారుణమన్నారు. బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీ కలిసిపోయిందంటూ  విష ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ధర్మ పోరాటంలో చంద్రబాబు టీడీపీని మరోమారు గెలిపించాలని అభ్యర్థిస్తున్నారన్నారు. ఆయనకు 25 ఎంపీ సీట్లు కట్టగట్టి నెత్తిన పెట్టాలని పిలుపునివ్వడం బాధాకరమన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు..మెజారిటీ సీట్లు ఇస్తే ఏం చేయలేని చంద్రబాబు ..అప్పుడేదే చేస్తానంటే జనం నమ్మరన్నారు. ఎన్నికల ప్రచార సభకు «దర్మ పోరాటం అని పేరు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చి 2009లో ప్రజల వద్దకు వెళ్తే బ్రహ్మరథం పట్టారన్నారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం నెరవేర్చకుండా ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కర్ణుడు దానం చేయలేదని..శ్రీరాముడు మంచి పరిపాలన చేయలేదని, వైయస్‌ రాజశేఖరరెడ్డి వాగ్దానాలు నెరవేర్చలేదని దిగజారుడు విమర్శలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. చంద్రబాబు కంటే నమ్మకద్రోహి, కుట్ర రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరు ఉండరన్నారు. కుట్ర అనే పదానికి పరిపూర్ణ అర్థం తీసుకువచ్చే వ్యక్తి చంద్రబాబు అని అభివర్ణించారు.  
 
Back to Top