ఇంకెంతకాలం మీ తప్పులు ప్రతిపక్షంపై రుద్దుతారు

పాతగుంటూరు ఘటన వైయస్‌ఆర్‌సీపీకి అంటగట్టడం సిగ్గుచేటు
ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలా..?
చంద్రబాబు చేతగానితనం వల్లే పోలీస్‌ స్టేషన్‌పై దాడి
అరటితోటలు దగ్ధమైన కేసులో విచారణ ఏమైంది
తుని ఘటనలో ఎవరినైనా దోషులుగా తేల్చారా?
విచారణ జరిగితే.. టీడీపీ వారే దోషులుగా తేలుతారని భయమా..?
ప్రజాస్వామ్యం అపహాస్యంపై చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, కోడెలకు లేదు
హైదరాబాద్‌: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పాత గుంటూరులో పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అంటగట్టే ప్రయత్నం సిగ్గుచేటని అంబటి విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు జరిగినా దాన్ని చంద్రబాబు ప్రతిపక్షంపై రుద్దడం కొత్తేమీ కాదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈస ందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో రాజధాని ప్రాంతంలో అరటితోటలు దగ్ధమైన ఘటన, తుని కాపు గర్జనలో రైలు తగలబడిన సంఘటనలను చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీ చేయించిందని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మళ్లీ కొత్తగా పాతగుంటూరు ఘటనను కూడా వైయస్‌ఆర్‌ సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

పాత గుంటూరు ఘటనతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అంబటి అన్నారు. ఎనిమిదేళ్ల బాలికపై 19 సంవత్సరాల యువకుడు అత్యాచారానికి ప్రయత్నిస్తే ఆ బాలిక అతడి నుంచి తప్పించుకుందన్నారు. అత్యాచారానికి యత్నించిన యువకుడిని పోలీసులు స్టేషన్‌కు తరలించడంతో నిందితుడిని అప్పగించాలని గ్రామస్తులంతా పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారన్నారు. ఆందోళన కారులు ఆవేశం ఆపుకోలేక పోలీస్‌స్టేషన్‌ప రాళ్లతో దాడి చేసి పోలీసులను కొట్టారన్నారు. దీనికి ఏ పార్టీ, ఏ సంఘంతో సంబంధం లేదన్నారు. ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్‌లో విఫలమైందనడానికి ఈ దాడి నిదర్శనమన్నారు. దీన్ని వైయస్‌ఆర్‌ సీపీకి ఆపాదించేందుకు ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నం చేస్తుందని చెప్పారు.
 
దాచేపల్లిలో బాలికపై వృద్ధుడు సుబ్బయ్య లైంగిక దాడికి పాల్పడితే.. చంద్రబాబు దీనిపై స్పందిస్తూ అతనికి ఇదే చివరి రోజు కావాలని మాట్లాడారని అంబటి గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. నిందితుడిని చట్టప్రకారం విచారించి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్‌ తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకే పాతగుంటూరులో పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగిందని, దీనికి బాబే నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయి నిందితులను శిక్షించాలనే దశకు ప్రజలు వెళ్తున్నారన్నారు. దాన్ని ప్రధాన ప్రతిపక్షంపై వేసి తప్పించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. 

దేశంలోనే అనుభవం కలిగిన వ్యక్తిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ మొత్తాన్ని నాశనం చేశారని అంబటి ధ్వజమెత్తారు. నేరాలు అదుపు చేసేందుకు ఉపయోగించాల్సిన పోలీస్‌ వ్యవస్థను కేవలం వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించి బెదిరించేందుకు ఉపయోగిస్తున్నారన్నారు. కుట్రలు ఛేదించేందుకు వినియోగించాల్సిన నిఘా వ్యవస్థను వైయస్‌ఆర్‌ సీపీలో ఎవరు చేరుతున్నారు.. ఎవరు అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాలపై ఆరా తీసేందుకు వినియోగిస్తున్నారన్నారు. పోలీస్, నిఘా వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటున్నారన్నారు. 

2014లో రాజధాని ప్రాంతంలో అరటితోటలు దగ్ధమైతే.. అప్పటి నుంచి ఇప్పటి వరు దోషులను ఎందుకు పట్టుకోలేదని అంబటి చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు. కడప నుంచి వైయస్‌ జగన్‌ మనుషులు వచ్చి తగలేశారని ఆరోపణలు చేసి తప్పించుకోవడం కాదు.. దోషులను నిరూపించలేని దౌర్భాగ్యస్థితిలో మీ పోలీస్‌ వ్యవస్థ ఎందుకు ఉందని నిలదీశారు. అదే విధంగా తునిలో రైలు దగ్ధమైన ఘటనలో వైయస్‌ఆర్‌ సీపీ నేతల పాత్ర ఉందని తనపై, భూమన కరుణాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణపై అనేక కేసులు పెట్టారని.. దానిపై విచారణ ఏమైందని.. దోషులను ఎవరినైనా తేల్చారా అని ప్రశ్నించారు. నిజంగా విచారణ జరిగితే టీడీపీ నేతలే దోషులుగా తేలుతారని అరటి తోట దగ్ధమైన సంఘటన జరిగిన ఆరు నెలలకే జిల్లా ఎస్పీని బదిలీ చేసి పంపించారన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ నుంచే ఎక్కడైనా లైటు వేయగలను.. బంద్‌ చేయగలనని చెప్పిన చంద్రబాబు దోషులను పట్టుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ కోడెల మాట్లాడడం సిగ్గుచేటని అంబటి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి ఎక్కడ విఘాతం కలిగిన దాన్ని ఖండించాల్సిందేనని.. కానీ ముందుగా మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాలని సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌కు లేదన్నారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే దానిపై చర్యలు తీసుకోకుండా టీడీపీ కార్యకర్తగా కోడెల పనిచేస్తున్నారని, అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. రూ. కోట్లు వెచ్చించి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిలో నలుగురిని మంత్రులుగా చేసిన నీకు సిగ్గుందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ దొరికిపోయినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా చంద్రబాబూ అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉండాలి.. ఏపీలో మాత్రం బట్టలు ఊడదీసినా పర్వాలేదా.. చంద్రబాబూ సమాధానం చెప్పాలన్నారు. 
 
Back to Top