ఇది ధ‌ర్మ‌మేనా బాబూ?

- చంద్ర‌బాబు  కొంగజపాలు నమ్మొద్దు
 - బాబు దీక్ష‌కు ప్ర‌భుత్వ ఖ‌జానా ఖ‌ర్చు
- వైయస్‌ జగన్‌ను ఫాలో అయ్యేందుకు సిగ్గులేదా చంద్రబాబూ?
 
విజయవాడ: చంద్రబాబు చేసేది ధర్మపోరాటం కాదు.. 420 దీక్ష అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా అన్ని విధాలు ప్రజలను మోసం చేస్తున్న 420 చంద్రబాబు అని, ఆయన చేసే దీక్ష ధర్మపోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధర్నాలు, దీక్షలకు పిలుపునిస్తే జపాన్‌ తరహా దీక్షలు చేయాలి. ఏదైనా ఉంటే ఢిల్లీకి వెళ్లి చేయాలన్న చంద్రబాబు ఇప్పుడు విజయవాడలో దీక్ష ఎందుకు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు ధర్మపోరాట దీక్ష అని పేరు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎప్పుడైనా మీ జీవితంలో ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తీసుకురావాలని ఇప్పటికే ఆయా మండలాల్లోని తహసీల్దార్‌లకు ఆదేశాలు అందాయని, అదే విధంగా పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను తీసుకురావాలని యాజమాన్యాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నిరాహార దీక్షను బ్రహ్మాండంగా చిత్రీకరించేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. 

రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్‌ పార్టీని వదిలేసిన చంద్రబాబు టీడీపీలో చేరారని, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. బామమరుదులను, తోడల్లుడిలను తొక్కేశాడని, ఆఖరికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఎదుర్కొనేందుకు సినీహీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌ వరకు తప్పించి పక్కనబెట్టిన ఘనమైన చరిత్ర చంద్రబాబుదన్నారు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాని లోకేష్‌ను దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి.. ఆ తరువాత మంత్రిని చేశారు.. దీంట్లో ఏ ధర్మాన్ని పాటించారో చెప్పాలన్నారు. జీవితమంతా ఎందుకు.. ఈ నాలుగు సంవత్సరాల్లో ధర్మాన్ని కాపాడారా.. అని ప్రశ్నించారు. ధర్మం తనంతట తాను నడిచి వెళ్తుంటే కాళ్లు విరగొట్టింది మీరు కాదా చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు. అధికారులపై ఎమ్మెల్యేలతో దండయాత్ర, దుర్భాషలాడించారు.. ఇది ధర్మమేనా చంద్రబాబు అని నిలదీశారు. 

ప్రత్యేక హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హోదా అవసరం లేదు.. ప్యాకేజీ అద్భుతంగా ఉందని చెప్పి.. మళ్లీ నాలుక మార్చి హోదా అంటున్నారు.. ఇది ధర్మమేనా చంద్రబాబూ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఏ పోరాటం చేయని వ్యక్తి ధర్మపోరాటం చేస్తున్నారంటే నమ్మలా చంద్రబాబూ..? ఢిల్లీలో దీక్షలు చేయాలన్న నీతులు టీడీపీకి వర్తించవా అని నిలదీశారు. సైకిల్‌ యాత్రలు, నల్లబ్యాడ్జీలు ధరించినందుకే చంద్రబాబు, లోకేష్‌లను ఆకాశానికి ఎత్తిన తోకపత్రికలు, రేపు జరగబోయే దీక్ష గురించి ఇంకా ఎంత ఎత్తుకు ఎత్తుతారో.. ఎన్ని విధాలుగా రాస్తారో వేచి చూడాలన్నారు. పేపర్‌ ఉద్యమాలు చేసే దశలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గమైన ఉద్యమాలు చేసేకంటే.. తప్పుచేశానని ప్రజలకు క్షమాపణలు చెప్పి దీక్షకు కూర్చోవాలన్నారు. 


మాటకు ముందోసారి.. వెనుకోసారి 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎలాంటి రాజకీయ అనుభవం లేని 4 పదుల వయస్సు దాటిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్ను ఎందుకు ఫాలో అవుతున్నారని అంబటి ప్రశ్నించారు. అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదని.. అవిశ్వాసం పెట్టావు.. దీక్షలు వద్దన్నావు.. మళ్లీ దీక్షకు కూర్చుంటున్నావు.. ఎందుకు అనుభవం అని చెప్పుకుంటూ వైయస్‌ జగన్‌ను ఫాలో అయ్యేందుకు సిగ్గులేదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే దౌర్భాగ్య రాజకీయాలు చేసేవాడు కాదని ఎద్దేవా చేశారు. పోరాటాల పురిటిగడ్డపై పుట్టి పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అని.. ఎవరో రాజకీయ పార్టీ పెడితే వారి దగ్గర నుంచి లాక్కున్న వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తి పోరాటాల పార్టీని ఫాలోకాక తప్పదన్నారు.  వైయస్‌ఆర్‌ సీపీ యువభేరీలు జరుపుతుంటే విద్యార్థులను పంపొద్దని తల్లిదండ్రులను హెచ్చరించి.. మళ్లీ దీక్షకు ఎందుకు విద్యార్థులను పిలిపించుకుంటున్నావు అని ప్రశ్నించారు. గాంధీ ఆచరించిన దీక్షకు జపాన్‌ దీక్ష.. సైకిల్‌ తొక్కడం జపాన్‌ దీక్ష.. ఊరూరా నిరాహార దీక్షలు జపాన్‌ దీక్ష అని అంటున్న చంద్రబాబు అసలు జపాన్‌ దీక్ష అంటే ఏంటో అర్థం చెప్పాలన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని, కొంగజపాలు నమ్మొద్దని.. అందరినీ ముంచి రాష్ట్ర ప్రజలను కేంద్రానికి అమ్మే పచ్చి అవకాశ వాది చంద్రబాబు అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలకు సూచించారు. 
 
Back to Top