మోదీ–బాబు జోడీ ఏమయ్యింది?


– బంద్‌ను అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు
– నాలుగేళ్ల పాటు బ్రిటీష్‌ తరహా ప్రభుత్వంతో టీడీపీ జతకట్టలేదా?
– ప్రత్యేక హోదా రాకుండా బాబు సర్వనాశనం చేశారు
– వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతోంది
– ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేరా?
– సబ్సిడీకొచ్చిన ఫుడ్‌ తింటూ పార్లమెంట్‌ ముందు టీడీపీ ఎంపీల వేషాలు
– చంద్రబాబు బినామీ మురళీమోహన్‌ కాదా?
– రాష్ట్ర ప్రయోజనాల కంటే దోచుకోవటమే టీడీపీ ఎంపీల లక్ష్యం
– రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు విదేశీ పర్యటన
– విదేశీ పర్యటనలతో బాబు సాధించింది ఏమీ లేదు

హైదరాబాద్‌: ఎన్నికల ముందు మోదీ– బాబు జోడీ అంటూ ప్రచారం చేసిన వీరు ఈ నాలుగేళ్లలో ఏం చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజల ఆకాంక్షను కాలరాసేలా బంద్‌లను విఫలం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ,వామపక్షాలు, జనసేన, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపును చంద్రబాబు అపహాస్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. ప్రధాని కూడా నిన్న చేసిన దీక్ష అపహాస్యం చేశారన్నారు. పార్లమెంట్‌ను నడపడంలో విఫలమైన ప్రధాని ప్రతిపక్షాలపై నెపం వేసే ప్రయత్నం చేశారన్నారు.  బంద్‌ పిలుపునిస్తే అపహాస్యం చేసే విధంగా  నారా చంద్రబాబు మాట్లాడారన్నారు. పోరాటాలు వేరే విధంగా ఉండాలని కామెంట్‌ చేసి సింగపూర్‌కు వెళ్లారన్నారు. ఉద్యమం హోరాహోరీగా జరుగుతుంటే ఆయన మాత్రం విదేశాలకు వెళ్లారన్నారు. ఆయన విదేశాలకు వెళ్లి ఏమీ సాధించారంటే అంతా శూన్యమే అన్నారు. ఏప్రిల్‌ 16న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 16న జరిగే బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాల్సిన బాధ్యత ఉందన్నారు. బంద్‌లు చేయడం ద్వారా ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేస్తామన్నారు. ఢిల్లీ నడి బజార్‌లో ధర్నాలు చేయాలని, బంద్‌లు చేయాలని చంద్రబాబు సూచించడం హాస్యాస్పదమన్నారు. ఆయన తలుచుకుంటే కేంద్ర వాహనాలు నడవవట. నీవేమన్నా..నియంతవా? అని ప్రశ్నించారు. బంద్‌లు, ధర్నాలు చేయకూడదని టీడీపీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంద్‌లు, నిరాహార దీక్షలు కావాలని, సింగపూర్‌ తరహాలో నిరసనలు తెలపాలని నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. బ్రిటీష్‌ తరహాలో పాలిస్తున్న బీజేపీతో నాలుగేళ్లుగా ఎందుకు జతకట్టారని ప్రశ్నించారు. కొంత కాలం మిత్రుత్వం చేశారు, కొంత కాలంగా శత్రుత్వంతో బయటకు వచ్చారన్నారు. మిత్రుత్వంలోనూ, శత్రుత్వంలోనూ చంద్రబాబుకు నిజాయితీ లేదన్నారు. బీజేపీని విబేధిస్తే ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. పోరాటం అంటే విచిత్ర వేషాలు వేయాలా? కొరడాలతో కొట్టుకోవాలా? అని నిలదీశారు. టీడీపీ ఎంపీలందర్ని కలిపి కొరడాలతో బాదాల్సిన అవసరం ఉందన్నారు.  పార్లమెంట్‌లో బాగా మెక్కి, బయటకు వచ్చి విచిత్ర వేషాలు వేస్తారా అని మండిపడ్డారు. ఒక ప్రక్క వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తుంటే మీరు ఫోటోలకు ఫోజులు ఇస్తారా అన్నారు.టీడీపీ ఎంపీలు బుద్ధి చెప్పుకోవాలని సూచించారు. సిగ్గుశరం ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వెళ్లారని, ఆయన ఢిల్లీలో బఫూన్‌లా వ్యవహరించారన్నారు. కేశినేని నాని ఒక ఐపీఎస్‌పై దాడి చేశారన్నారు. గళ్ల జయదేవ్‌ ప్రధాని పార్లమెంట్‌లో లేని సమయంలో గర్జించారని, ఆయనకు గొప్ప ఊరెగింపు నిర్వహించారన్నారు. మురళిమోహన్‌ చంద్రబాబుకు బినామీగా ఉన్నారు. సొంత వ్యాపారాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయరని విమర్శించారు. పోరాటం అంటే చంద్రబాబు భాషలో రాజీనామాలు చేయడం కాదు..దీక్షలు చేయడం కాదు..బంద్‌లు చేయడం కాదని, పార్లమెంట్‌ మెట్ల వద్ద వంగడమేనా అని ప్రశ్నించారు. ఏదో విధంగా బంద్‌ను విఫలం చేయాలని కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బంద్‌కు సంపూర్ల మద్దతు ఇచ్చి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. గతంలో వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలు చేసిన సమయంలో కేసులు పెట్టారని, వైయస్‌ జగన్‌ను ఏయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారని గుర్తు చేశారు. బంద్‌ను విఫలం చేయడం ద్వారా తెలుగు ప్రజలు ఏకతాటిపై లేరనే అభిప్రాయాన్ని కేంద్రాని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బంద్‌ను విజయవంతం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. చంద్రబాబు మాటలు మార్చే మాంత్రికుడిగా ఉన్నారని, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించి బంద్‌కు మద్దతు లె లపాలని సూచించారు. చంద్రబాబు మన రాష్ట్రంలో సక్రమంగా పరిపాలన చేయాలని, సింగపూర్‌ జపం మానుకోవాలని సూచించారు. మోడీ..బాబు జోడీ రాష్ట్రానికి జాడీలా పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి మోడీ, చంద్రబాబులే కారణమన్నారు. 
 
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍
Back to Top