ప్రతిపక్షనేత మీద జరిగిన దాడిపై చంద్రబాబు, డీజీపీ తీరు జుగుప్సాకరంసీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటే గంటలోనే సమాచారం ఎలా అందిందినిందితుడి కులం పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటీ విచారణ జరగకుండానే చిన్నగాయమన్న డీజీపీ వ్యాఖ్యలు హేయనీయంవిజయవాడ: ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై చంద్రబాబు, డీజీపీ వ్యవహరించిన తీరు జుగుస్సాకరం ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు, డీజీపీ ప్రెస్‌మీట్లలో మాట్లాడిన తీరు చూస్తుంటే దాడి ఎవరు చేయించారో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. టీడీపీ కార్యాలయం నుంచే ఆపరేషన్ గరుడ పథక రచన జరిగిందని స్పష్టమవుతుందన్నారు విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో 12:20 నిమిషాల ప్రాంతంలో ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. గంటలోనే డీజీపీ మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తూ నిందితుడి ఫొటోను, ఫ్లెక్సీ, కులాన్ని ప్రస్తావిస్తూ చిన్న విషయంగా తీసివేసే ప్రయత్నం చేయడంలో ఆంతర్యమేంటనీ ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే దానికి బాధ్యత వహించకుండా ఎయిర్‌పోర్టు మా పరిధి కాదు.. సీఐఎస్‌ఎఫ్ అని మాట్లాడిన చంద్రబాబు, డీజీపీ గంటలోనే సమాచారం ఏ విధంగా తీసుకువచ్చారని, నిందితుడి ఫొటో సీఐఎస్‌ఎఫ్ విడుదల చేయకుండా ఎలా సేకరించారని నిలదీశారు.
ఆపరేషన్ గరుడ ముమ్మాటికీ చంద్రబాబు స్కెచ్ అని, నిందితుడి సమాచారం.. దాడికంటే ముందే తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందని పార్థసారధి అన్నారు. చంద్రబాబు కుట్రలో భాగం కాకపోతే ఏ విధంగా గంటలో తప్పుడు సమాచారం తీసుకొచ్చారని ప్రశ్నించారు. డీజీపీ చిన్న గాయం.. ప్రచారం కోసం వైయస్ జగన్ అభిమాని చేశారని చెప్పారు.. ఉన్నతస్థాయి అధికారి ఏ విధంగా ప్రతిపక్షనేతపై జరిగిన దాడిపై ఎంక్వైరీ కూడా జరుగకుండా చిన్నదిగా ఎలా తగ్గించే ప్రయత్నం చేశారని నిలదీశారు. రిమాండ్ రిపోర్టులో వైయస్ జగన్‌పై హత్యాప్రయత్నం జరిగిందని, ఆ కత్తి మెడపై గుచ్చుకుంటే ప్రాణాలు పోయేవని వచ్చిన విషయాన్ని ఎందుకు డీజీపీ తగ్గించి మాట్లాడారని, డీజీపీ మాటలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే సానుభూతి వ్యక్తం చేసి.. యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన చంద్రబాబు.. పరామర్శించిన వారిపై కూడా నేర ఉద్దేశం అంటగట్టే ప్రయత్నం చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ జగన్‌ను బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా, నేరుగా పరామర్శిస్తే దాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టి నీచంగా మాట్లాడడం హేయనీయమన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై బాంబు దాడి జరిగిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తిరుపతి వెళ్లి పరామర్శించారని, అంతటితో ఆగకుండా గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడి ఐదురోజులు అవుతుందని, ఇప్పటికీ ప్రభుత్వ తరుపు నుంచి యోగక్షేమాలు తెలుసుకునేందుకు చంద్రబాబు తన కోటరీని పంపించకపోవడం ఎంత నీచమైన ప్రవృత్తో అర్థం అవుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికా సమావేశాలు చేస్తుంటే ఎంత క్రూరమైన మనస్తత్వమో అర్థం అవుతుందన్నారు. టీడీపీ నేతలు ఒకరేమో కైమా కైమా అంటారు.. మరొకరు హత్య చేస్తే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తామంటారు.. ఇంకొకరు కుటుంబసభ్యులకే అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆఖరికి బుద్ధి లేని బుద్దా వెంకన్న కూడా వైయస్ జగన్‌పై విమర్శలు చేయడం ఐదుకోట్ల ప్రజానికానికి బాధ కలిగిస్తుందన్నారు. క్రూరత్వం తెలుగుదేశం పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని, అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే చంపేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే ఉమ్మేయాలనేలా ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వ ఎంక్వైరీ సంస్థలతో ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నంపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. భగవంతుడి ఆశీస్సులతో వైయస్ జగన్ వెంటనే కోలుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు.