రాష్ట్రం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే సంపూర్ణ ఆరోగ్యం
అభివృద్ధిని చంద్రబాబు అంపశయ్యపై పడుకోబెట్టారు
టీడీపీది అహింసా మార్గమనడం సిగ్గుచేటు
జన్మభూమికి సేవ చేయని వారు ద్రోహులా?
మరి జన్మభూమిని కించపరిచేలా మాట్లాడింది మీరు కాదా బాబూ?
వైయస్‌ జగన్‌ చెప్పేవని అబద్ధాలనడం విడ్డూరం
రాష్ట్రంలో ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధం
విజయవాడ: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రరాష్ట్రానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సంపూర్ణ ఆరోగ్యం జీవిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. విభజనతో అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని బాగు చేస్తానని.. అనుభవం ఉందని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ చేసుకున్న చంద్రబాబు నట్టేట ముంచాడన్నారు. నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసి దోచుకోవడానికి మరో అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధిని అంపశయ్యపై పడుకోబెట్టారని, త్వరగా రాష్ట్రాన్ని వైయస్‌ జగన్‌ చేతిలో పెట్టాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లు తాను సాధించిందేమిటో.. రాష్ట్రంలో పూర్తి చేసిన ప్రాజెక్టులన్నో, విభజన చట్టంలోని అంశాల్లో సాధించిందేంటో, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చినవేమిటో చెప్పలేడు కానీ.. 2022, 2029, 2050 అంటూ అంకెలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడన్నారు. 

తెలుగుదేశం పార్టీది అహింసా విధానం అని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని పార్థసారధి అన్నారు. రాష్ట్ర ప్రజల మీద దాడులు చేసేది టీడీపీ నేతలు కాదా.. అహింసా మార్గమైతే వారిపై చర్యలు తీసుకున్నావా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? ఐపీఎస్‌ అధికారిని రోడ్డుపై నిలబెట్టి దుర్భాషలాడిన ఎంపీ, ఎమ్మెల్సీపై, దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై. ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారాలకు పాల్పడిన టీడీపీ ఎంపీటీసీలు, నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రజలు విపరీతమైన దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. అవి మీ కంటికి కనిపించడం లేదా చంద్రబాబూ? సాక్షాత్తు డీజీపీ అధికార పార్టీ ఒత్తిడి మూలంగానే బాలికపై  అత్యాచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పారని గుర్తు చేశారు. అహింసా మార్గం అని చెప్పేముందు ఏ మార్గంలో ఉన్నారో ఆలోచించుకోవాలన్నారు. 

చంద్రబాబు నోటి నుంచి మరోఆణిముత్యం రాలిందని, జన్మభూమికి సేవ చేయనివారు ద్రోహులుగా మిగిలిపోతారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నాకు అవకాశం ఉంటే అమెరికాలో పుట్టాలనుకునే వాడిని కానీ.. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాలనుకుంటానని చంద్రబాబు మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు. దేశంలోని ఇంజినీర్లు మురికి కాల్వలను మాత్రమే డిజైన్‌ చేస్తారని దేశాన్నే అవమానించిన చంద్రబాబు.. జన్మభూమి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. విదేశీ మోజులో సింగపూర్, జపాన్‌ లాంటి దేశాలకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి జన్మభూమి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. మోడీ మిమ్మల్ని నమ్మించారు కాబట్టే ప్రత్యేక హోదా వద్దనుకున్నానని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. అదే వాస్తవం అయితే ప్రత్యేక హోదా కలిగిన 11 రాష్ట్రాలకు హోదా పొడిగించిన తరువాత ప్రత్యేక గురించి మాట్లాడావా.. లేదా..? స్పష్టం చేయాలన్నారు. కేంద్రమే మోసం చేస్తే ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో కులికి అధికారాన్ని పంచుకొని ఈ రోజు పోరాటం చేశానని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 30సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు సమస్యలను నేషనల్‌ మీడియా దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు. నీతి ఆయోగ్‌ మీటింగ్‌లో నీ కోపాన్ని ఎందుకు ప్రదర్శించలేకపోయావు చంద్రబాబూ అని నిలదీశారు. మోడీకి వంగి వంగి దండాలు పెట్టి ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. 

బహిరంగ సభల్లో ప్రతిపక్ష నేత వూయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పేవి అబద్ధాలైతే.. రాష్ట్రంలో ఏ సెంటర్‌లోనైనా టీడీపీ నేతలతో చర్చకు సిద్ధమని పార్థసారధి సవాలు విసిరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పోరాటం చేయండి ప్రతిపక్షం కలిసి వస్తుందని చెబితే.. రాజీనామాలు చేయడానికి టీడీపీ మీనమేషాలు లెక్కించిందన్నారు. అధికారం పోతే ముడుపులు సాధ్యం కావనే ఉద్దేశంతో కేంద్రం నుంచి బయటకు రాకుండా వైయస్‌ఆర్‌ సీపీపై బుదరజల్లే కార్యక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయని ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఇవాళ ప్రజల కోసమే కేంద్రం నుంచి బయటకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ నేరాలను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బలహీనవర్గాలను కించపరిచేలా వ్యవరించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.  రాష్ట్ర ప్రజయోజనాల కంటే కుర్చీలే ముఖ్యంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. జనాన్నిబలవంతంగా బస్సుల్లో ఎక్కించుకొని మీటింగ్‌లకు తరలిస్తూ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. రామరాజ్యం కావాలంటే వైయస్‌ జగన్‌ ఒక్కరితోనే సాధ్యమన్నారు. 
Back to Top