అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఆదుకుంటాం

అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌ సీపీ భరోసా
ప్రభుత్వానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదు
విజయవాడ: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి హామీ ఇచ్చారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా భావించి బాధితుల పక్షాన నిలబడి వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను నాలుగు సంవత్సరాల్లో పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం కుట్ర బుద్ధికి నిదర్శనమన్నారు. బాధితుల్లో నిరుత్సాహాన్ని, భయాందోళనలను నింపి ఆస్తులను ఏ విధంగా కాజేయాలని ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. 

వందల కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేసే చంద్రబాబుకు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని పార్థసారధి ఆరోపించారు. గోదావరి పుష్కరాలకు రూ. 2 వేల కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ. 16 వందల కోట్లు, మహిళా పార్లమెంటరీ సమ్మిట్‌కు రూ. 2 వందల కోట్లు, విమానయానానికి రూ. 2 వందల కోట్లు, ముఖ్యమంత్రి గెస్ట్‌ హౌజ్‌ మరమ్మతులకు రూ. వంద కోట్ల ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేశారన్నారు. రూ. 11 వందల కోట్లు విడుదల చేస్తే 80 శాతం మంది అంటే 16 లక్షల వంది బయటపడే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలని తప్పితే.. వారిని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే అన్ని ప్రజా సంఘాలతో సమావేశమై.. ఇతర రాష్ట్రాల రాజకీయ పక్షాలను కలుపుకొని పరిష్కారం చూపేవారన్నారు. 

అంబానీ వస్తేనే పెద్ద కార్యక్రమంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు 32 లక్షల మందికి సంబంధించిన సమస్యపై ఓ సంస్థ అర్ధరాత్రి కలిస్తే దాన్ని ఎందుకు ప్రజలకు వివరించలేదని పార్థసారధి ప్రశ్నించారు. ఆస్తులను కాజేయాలనే ఉద్దేశ్యంతో సంస్థలతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నారు. బాబువన్నీ అర్ధరాత్రి పనులేనని ప్రత్యేక ప్యాకేజీ అర్ధరాత్రే ఒప్పుకున్నారు.. ఇప్పుడు అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు ఆర్ధరాత్రి సమావేశాలు నిర్వహించారన్నారు. ఢిల్లీలో ఎస్‌ఎల్‌ సంస్థతో జరిగిన భేటీలో ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారో చెప్పాలన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఉన్న బాధితులెవరూ అధైర్యపడొద్దని.. బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

Back to Top