బుర్ర‌కథను తలపిస్తున్న మహానాడు


చంద్రబాబు కథకుడు.. అటూ, ఇటూ జోకర్లు
అభివృద్ధిపై నోరు విప్పే దమ్ము లేని పాలన
ప్రత్యేక హోదాపై మీరు చేసిన పోరాటాలేంటో చెప్పాలి
శ్వేతపత్రం విడుదల చేసిన తరువాత గర్జించు చంద్రబాబూ
రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా.. కేంద్రానికి ఎందుకు సపోర్టు చేశారు
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు గ్రామాల్లో చెప్పే బుర్ర‌కథలు, హరికథలను తలపిస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. కథకుడిగా చంద్రబాబు.. అటు పక్క జోకర్లు.. ఇటు పక్క రాజకీయ నాయకులు కూర్చొని ప్రేక్షకులను కనువిందు చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. మహానుభావుడు ఎన్టీఆర్‌ జయంతి నాడు నిర్వహించే మహానాడు అబద్ధాలు, మోసాలతో సాగుతోందని పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల్లో టీడీపీ సాధించిన విజయాలేంటో.. రాబోయే సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారోనని ప్రజలంతా ఎదురు చేశారని, కానీ చంద్రబాబు అభివృద్ధిపై నోరువిప్పే దమ్ము, సత్తా లేదన్నారు. మహానాడు అంతా బు్రరకథలా సాగుతోందన్నారు.  

చంద్రబాబు నాలుగు సంవత్సరాల పరిపాలన మూడు మోసాలు, ఆరు వైఫల్యాలు తప్పితే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన అంశాలు ఒక్కటీ లేవని పార్థసారధి అన్నారు. 50 శాతం పోలవరం, రాజధాని కట్టామని చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పెత్తందారి వ్యవస్థలకు కొమ్ముకాస్తున్నారని అనేక సందర్భాల్లో చెప్పామని గుర్తు చేశారు. సంక్రాంతి కానుకల పేరుతో హెరిటేజ్‌ సంస్థ నుంచి కుళ్లిపోయిన సరుకులను తెచ్చి ఇస్తూ కోట్లు దండుకుంటున్నాడన్నారు. 

చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు, దాష్టికాలు, అవినీతి చేసినా రాజకీయంగా మాట్లాడమని, ఏనాడూ కుటుంబ సభ్యులను పబ్లిక్‌లోకి తీసుకురాలేదన్నారు. కానీ మహానాడు వేదికగా తెలంగాణకు సంబంధించిన ఒక దద్దమ్మ వైయస్‌ జగన్‌ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కుటుంబసభ్యులను కించపరిచేలా మాట్లాడడం తప్పని వారించాల్సిన ముఖ్యమంత్రి వెకిలినవ్వులు నవ్వుకుంటుంటే ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు వెంకటేశ్వరస్వామి వాళ్ల ఇంటికే దేవుడు అన్నట్లుగా గొప్పలు చెప్పారని, దేవుడిని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుంటే.. వేదికపై కూర్చొని చంద్రబాబు నోరు మెదపకపోవడం సిగ్గుమాలినతనం అన్నారు. 
చంద్రబాబు, లోకేష్‌ వెంకటేశ్వరస్వామి ఆయన ఇంటికే దేవుడు అయినట్లు గొప్పలు చెప్పారు. 

తన చేతగాని తనాన్ని, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడంలో చంద్రబాబును మించిన వ్యక్తి ఇంకొకరు లేరని పార్థసారధి అన్నారు. మహానాడు మొత్తం అదే తంతు జరిగిందన్నారు. నాలుగేళ్లలో ఇచ్చిన హామీలను ఇంత శాతం నెరవేర్చామని చెప్పలేని బలహీన పరిస్థితిల్లో చంద్రబాబు ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం తప్ప పరిపాలనకు మార్గనిర్దేశం చేసిన దాఖళాలు లేవన్నారు.

ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పార్థసారధి గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలుగా నవరంధ్రాలు మూసుకొని కూర్చున్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ గర్జిస్తున్నానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం ఏఏ సందర్భాల్లో ఏఏ పోరాటాలు చేశారో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, టీడీపీ కలిసి హోదాను భూస్థాపితం చేసి ప్రత్యేక ప్యాకేజీని తయారు చేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో యువత, విద్యార్థులు, ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కేసులు పెట్టించింది మీరు కాదా.. చంద్రబాబూ.. ఇవన్నీ శ్వేతపత్రంలో పెట్టాలన్నారు. శ్వేతపత్రం విడుదల చేసిన తరువాత గర్జించు.. పిల్లి కూతలు కూసినా మాకు సంబంధం లేదన్నారు. 

జీఎస్టీ, నోట్లరద్దు గురించి చంద్రబాబు ఇవాళ మాట్లాడుతున్నారని, ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా కేంద్రానికి జీఎస్టీ విషయంలో ఎందుకు సపోర్టు చేశారని విరుచుకుపడ్డారు. ప్రపంచంలో చంద్రబాబు కంటే మేధావి లేడని నోట్లరద్దు కమిటీకి చైర్మన్‌గా నియమించారని, ఈ రోజున చంద్రబాబు బ్యాంక్‌లలో నగదు దొరికే పరిస్థితి లేదు.. బ్యాంక్‌లు రూ. 7.5 లక్షల కోట్లు దివాళా తీశాయని మాట్లాడుతున్నాడన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై లేదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. బాధ్యత నుంచి తప్పించుకునే పిరికిపంధ చంద్రబాబు అని విమర్శించారు. 

వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడడం.. అంతకంటే దౌర్భాగ్యం ఇంకొటి ఉండదని పార్థసారధి అన్నారు. ధరల స్థిరీకరణ నిధిని వైయస్‌ జగన్‌ ముందుగానే ప్రకటిస్తే.. చంద్రబాబు రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని గొప్పలు చెప్పారన్నారు. కనీసం ఈ నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చిందని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఆఖరి రోజు మహానాడులోనైనా సమాధానం చెప్పాలన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. 
 

Back to Top